Komuram Bheem Real Story: ఆర్ఆర్ఆర్‌ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం కనిపించబోతున్నాడు. మరి ఆయన అసలు చరిత్ర ఏంటి ? ఆదిలాబాద్ అడవుల్లో కొమురం భీమ్‌ సాగించిన పోరాటం ఏంటి? ఆయన వాస్తవ చరిత్ర ఏంటి? జీ తెలుగు న్యూస్‌ స్పెషల్‌ స్టోరీలో చూద్దాం. భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో తెలుగు మన్నెం వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు చెప్పుకోదగిన గొప్ప వ్యక్తులు. బ్రిటిష్‌ వారిని ఎదిరించింది అల్లూరి సీతారామ రాజు అయితే, నిజాంను ఎదిరించిన గండర గండడు కొమురం భీమ్.
 
తన జాతి కోసం జల్‌, జంగిల్‌, జమీన్‌.. అంటే నీరు, అడవి, భూమి కావాలంటూ పోరుసల్పి నైజాం నవాబుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన గండరగండడు కొమురం భీమ్‌. ఈ గోండు వీరుడు దట్టమైన అడవులతో అలరారే ఆసిఫాబాద్ జిల్లాలోని సుంకెపల్లి అనే మారుమూల గిరిజన గూడెంలో 1901 అక్టోబర్‌, 22న జన్మించారు. ఇక్కడి గిరిజనులు అడవిలోని సెలయేళ్ల వలె కల్మషం లేని మనసు కలిగిన వారు. అడవిలోని క్రూరమృగాలను సైతం మట్టుబెట్టగల ధీరోధాత్త హృదయం కలిగిన వారు. ధర్మం కోసం, తమ జాతి కోసం ప్రాణాలైనా లెక్కచేయని వీరులు ఈ గోండు గిరిజనులు. ఈ అమాయక మనస్తత్వమే నిజాం నవాబు రక్కసి మూకల చేత నిలువుదోపిడీకి గురైంది. ఈ మూకలు అటవీ అధికారుల ముసుగులో, దళారుల ముసుగులో అమాయక గోండు గిరిజనంపై సాగించిన దౌర్జన్యం వర్ణణాతీతం. ఈ దౌర్జన్యాన్ని ఎదిరించే కొమురం భీమ్ తండ్రి కొమురం చిన్ను నైజాం సేనల మారణకాండకు బలయ్యారు. తన తల్లిని కూడా 15వ యేట కోల్పోయిన కొమురం భీమ్‌ అడవుల్లో వ్యవసాయం చేసుకుంటున్న సమయంలో కష్టాలు మొదలయ్యాయి. సిద్ధిక్‌ అనే పట్టేదారుడు భీమ్‌ సోదరులు చిన్న పిల్లలే కనుక బెదిరించి ఆ భూమిని, వారు పండిస్తున్న పంటను సొంతం చేసుకోవాలనుకున్నాడు. మిగిలిన అమాయక గిరిజనుల లాగే ఈ సోదరులు కూడా తనకు దాసోహం అవుతారనుకున్నాడు. కానీ, సిద్ధిక్‌ వచ్చి భీమ్‌ సోదరులను బెదిరించగానే కొమురం భీమ్‌ తిరగబడి తన చేతిలోని గొడ్డలితో సిద్ధిక్‌ను అక్కడికక్కడే నరికి చంపేశాడు. 
 
వెంటనే నైజాం సైన్యం కొమురం భీమ్‌ను బంధించడానికి సుంకెపల్లికి వెళ్లింది. దీనిని పసిగట్టిన భీమ్‌.. ఆ సేనను తప్పించుకొని మహారాష్ట్రలోని చాంద, అటునుంచి పూనా వెళ్లి తలదాచుకున్నాడు. కొమురం భీమ్‌ పూనాకు చేరుకున్న సమయంలో అక్కడ భారత స్వాతంత్ర్య సమరం మహోజ్వలంగా సాగుతోంది. అక్కడి సమరయోధుల సహకారంతో రాయడం, చదవడం నేర్చుకున్నాడు. వారి తోడ్పాటుతో అస్సాంకు వెళ్లి ఆయుధ శిక్షణ తీసుకున్నాడు. అస్సాం నుంచి తిరిగి వచ్చి కెరమెరి మండలంలోని బాలేఝరి చుట్టుపక్కల గల 12 గూడేల వన వాసులను ఏకం చేశాడు. వందలాది ఎకరాల అడవిని నరికి సాగుభూమిగా చేసి పోడు వ్యవసాయం ఏర్పాటు మొదలుపెట్టాడు. నైజాంకు శిస్తులు కట్టకుండా నిరాకరించి సహాయ నిరాకరణ చేస్తూ అక్కడి నీరు, అడవి, భూమి స్థానికులవే అని నినదించాడు. గోండు వీరుల్లో ఉత్సాహం నింపి వారిని మెరికల్లా తయారుచేశాడు. వీరిని అణచడానికి నైజాం సైన్యం, పోలీసులు రంగప్రవేశం చేశారు.
  
గోండు వీరులు భీం నాయకత్వాన గెరిల్లా పోరు సాగించి దొరికిన సైనికులను దొరికినట్లే మట్టుబెట్టసాగారు. పరిస్థితులు విషమించడం నైజాం రాజు గమనించాడు. పోరుబాటలో భీంను దారికి తెచ్చుకోలేమని తలచాడు. సంధి నెపంతో ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ను భీం వద్దకు పంపాడు. కానీ, కొమురం భీమ్‌ ప్రశ్నల ముందు కలెక్టర్‌ తాళలేకపోయాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లిన కొమురం భీమ్‌.. నిజాం దర్బారులో జోడేఘాట్‌ ప్రాంతంలోని 12 గూడెంలపై సర్వహక్కులు గిరిజనానివేనని స్పష్టం చేశారు. కొమురం భీం తిరిగి వెళ్లగానే గిరిజన గూడెంలపై నిజాం రాజు తన రజాకార్‌ సేనను ఉసిగొల్పాడు. అటు నిజాం సైన్యం, ఇటు రజాకార్లు గోండు గూడేల్లో తమ పైశాచిక కృత్యాలు మొదలుపెట్టారు. అమాయక గోండు గిరిజనులపై అత్యాధునిక మారణాయుధాలు తుపాకులు ఎక్కుపెట్టారు. తమ వద్ధ అత్యాధునిక ఆయుధాలు లేకున్నా కొమురం భీం ఇచ్చిన కొండంత అండతో గోండు గిరిజనులు గెరిల్లా పోరు సాగించారు. 
 
భీం సైన్యాన్ని ఆయుధపోరులో ఎదుర్కోలేని నైజాం సేన కుయుక్తితో భీంను మట్టుబెట్టాలనుకుంది. 1940వ సంవత్సరం అక్టోబరులో ఆశ్వయుజ పౌర్ణమి నాడు అడవిలో వెన్నెల పిండారబోసినట్లుగా ఉంది. కొదమసింహం కొమురం భీం ఆ అడవిలో ఆదమరిచి నిద్రిస్తున్నాడు. నేరుగా పోరుతో ఎదుర్కోలేని నైజాం తాలూక్దార్‌ సైన్యం నిద్రిస్తున్న కొమురం భీం ను చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించారు. వెంటనే నిదుర నుంచి మేలుకున్న కొదమసింహం నైజాం పైశాచిక సేనలకు ఎదురొడ్డి వీరోచిత పోరు సల్పారు. కానీ, అత్యాధునిక ఆయుధ సంపత్తి, కుయుక్తులు తోడైన నైజాం రాక్షస సేన ముందు కేవలం ఆత్మవిశ్వాసమే ఆలంబనగా పరిమిత వనరులతో పోరుసల్పుతున్న భీమ్‌ ఓడిపోయాడు. ముష్కర మూకల దుష్కర పోరులో భరతమాత ముద్దుబిడ్డడు, గండరగండడు, కొదమ సింహం, కొమురంభీం నేలకొరిగాడు. ఆ ధృవతారను మరవని గిరిజనం ప్రతీఏడూ జోడేఘాట్‌లో కొమురంభీం సంస్మరణ సభ నిర్వహిస్తుంది. జల్‌, జంగిల్, జమీన్‌  స్థానిక గిరిజనులకే దక్కాలని కడదాకా పోరు సల్పిన కొమురం భీం ఆశయాలు ఇంకా నెరవేరలేదు. కొమురం భీమ్‌ మనుమరాలు సోనూబాయి కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేకుండా పూరిగుడిసెలోనే పట్టాసైతం కరువైన భూమిలో బతుకీడుస్తోంది. అక్కడి గిరిజనం తమ బూముల కోసం పట్టా పాస్‌బుక్‌ల కోసం ప్రతి అధికారిని వేడుకుంటున్నారు. గ్రామ పంచాయతీకి దిక్కులేక ప్రభుత్వ పథకాలకు దూరంగా గడుపుతున్నారు. కేవలం కొమురం భీం వర్థంతి రోజు వేసే తాత్కాలిక రోడ్లు, విద్యుత్‌ దీపాలను చూసి మురిసిపోయే దుస్థితి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 గిరిపుత్రులకు దన్నుగా నిలిచే వన్నాఫ్‌ సెవెంటీ (1/70) చట్టాన్ని ఉల్లంఘించి ఇతరులు వాళ్ల భూములను సాగు చేస్తున్నారు. ఆక్రమించుకుంటున్నారు. అయినా, ప్రభుత్వాలు వీరి గోడు వినడం లేదు. గిరిజనుల ఉనికి, విద్య, వైద్యానికి పూర్తి భరోసా ఇవ్వడమే ఆ వీరుడికి మనం ఇచ్చే ఘన నివాళి. ఇప్పుడు ఈ చరిత్రనే ఆర్ఆర్ఆర్‌ సినిమాలో కొమురం భీం పాత్రకు వినియోగించారు. ఇది ఫిక్షనల్‌ స్టోరీ అని దర్శకుడు రాజమౌళి చెబుతున్నా.. కొమురం భీమ్‌ అనగానే ఆ యోధుడే గుర్తుకువస్తాడు. ఆ గండరగండని పాత్రలో జూనియర్‌ ఎన్టీయార్‌ (Jr Ntr as Komuram Bheem in RRR Movie) కనిపించబోతున్నారు.


Also read : RRR Movie Tickets: గ్యాస్ సిలిండర్ తీసుకుంటే.. ఉచితంగా ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్లు! ఎక్కడో తెలుసా?!!


Also read : RRR: 'ఆర్ఆర్ఆర్'కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్ల పెంపునకు అనుమతి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook