దక్షిణాది చిత్ర పరిశ్రమల నుంచి మొదలుపెడితే, బాలీవుడ్ వరకు ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ కోవలోనే తాజాగా మరో సినీ నటి రియల్ స్టోరీ తెరకెక్కబోతోంది. బీ గ్రేడ్ సినిమాలతో పాపులర్ అయిన నటి షకీలా బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతకీ షకీలా పాత్రను తెరకెక్కించబోయేది ఎవరో కాదు.. బాలీవుడ్‌‌లో బోల్డ్ హీరోయిన్స్‌లో ఒకరిగా పేరొందిన నటి రిచా చద్దా. బాలీవుడ్‌లో ‘లవ్‌ యు అలియా’ అనే సినిమాను తెరకెక్కించిన ఇంద్రజిత్‌ లంకేశ్‌ షకీలా బయోపిక్ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాదిన గతంలో అడల్ట్స్ ఓన్లీ సినిమాలతో కుర్రకారుకి మత్తెక్కించిన షకీలా అప్పట్లో మెయిన్ స్ట్రీమ్ సినిమా ఆర్టిస్టులకన్నా అధిక పారితోషికం అందుకునేది అనే పేరుంది. షకీలా నటించిన కొన్ని మళయాళం సినిమాలు ఆ తర్వాత జపనీస్‌, చైనీస్‌ లాంటి విదేశీ భాషల్లోకి డబ్ అయిన సందర్భాలున్నాయి. 


అడల్ట్స్ ఓన్లీ సినిమాల్లో అవకాశాలు తగ్గిన అనంతరం తెలుగు, తమిళ, కన్నడ భాషా సినిమాల్లో కామెడీ పాత్రలు చేసిన షకీలా రియల్ లైఫ్‌లో ఆమెకు ఎంతో మంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో సంబంధాలు వున్నాయనే ప్రచారం పరిశ్రమలో ఇవాళ కొత్తది కాదు. అయితే, ఆయా వివరాలన్నీ ఈ బయోపిక్‌లో పొందుపరుస్తారా అనేదే ప్రస్తుతానికి ఆసక్తిని రేకెత్తించే అంశం.