రాజమౌళిపై శ్రీదేవికి అప్పుడు అంత కోపం ఎందుకొచ్చింది ?
బాహుబలి సినిమాతో టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఒక్క అతిలోక సుందరి శ్రీదేవి వద్ద మాత్రం తీరని విభేదాలను సొంతం చేసుకున్నాడు.
బాహుబలి సినిమాతో టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఒక్క అతిలోక సుందరి శ్రీదేవి వద్ద మాత్రం తీరని విభేదాలను సొంతం చేసుకున్నాడు. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర కోసం రమ్యకృష్ణ కన్నా ముందుగా తాము శ్రీదేవిని ఆ పాత్ర చేయాల్సిందిగా కోరామని, కానీ ఆమె అందుకు భారీ పారితోషికం డిమాండ్ చేశారని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం ఆమెను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. అన్నింటికిమించి ఆమె బాహుబలి సినిమాను తిరస్కరించడం వల్ల తమకి మేలే జరిగిందని రాజమౌళి చేసిన కామెంట్ ఆమెని మరింత అసహనానికి గురిచేసింది.
రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపడం, శ్రీదేవి ఎక్కడికెళ్లినా మీడియా వాళ్లు తనను ఇదే విషయం గురించి గుచ్చిగుచ్చి అడగడం ఆమెని మరింత బాధపెట్టింది. చివరకు తాను నటించిన మామ్ సినిమా ప్రమోషన్స్ లోనూ శ్రీదేవికి బాహుబలి సినిమా గురించే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై స్పందించిన శ్రీదేవి.. రాజమౌళి తన గురించి అలా చెడుగా కామెంట్ చేసి వుండాల్సింది కాదు అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. అప్పట్లో నేషనల్ హెడ్ లైన్స్ లోకి ఎక్కిన ఈ వార్తలు బంతిని మళ్లీ రాజమౌళి కోర్టులోకి తీసుకొచ్చాయి.
రాజమౌళి సైతం ఓసారి ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నిజంగానే తాను శ్రీదేవి గురించి అసలు మాట్లాడాల్సింది కాదు అని అంగీకరించారు. తాను శ్రీదేవి గురించి చెప్పి వుండకపోయి వుంటే ఈ వివాదం అసలు బయటికొచ్చేదే కాదేమోనని ఒకింత ఆవేదన వ్యక్తంచేశారు జక్కన్న. తాజాగా శ్రీదేవి మృతి నేపథ్యంలో శ్రీదేవి అభిమానులు ఆమె ఎదుర్కున్న ఈ వివాదాన్ని గుర్తుచేసుకుంటున్నారు.