శ్రీదేవి అంత్యక్రియలు మంగళవారం జరగకపోవడానికి కారణాలు !
శ్రీదేవి అంత్యక్రియలు నేడు జరిగే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
శ్రీదేవి అంత్యక్రియలు నేడు జరిగే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. దుబాయ్‌లోని జుమేరియా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో ఫిబ్రవరి 24న అర్ధరాత్రి శ్రీదేవి మృతిచెందిన అనంతరం ఆరోజు నుంచి మొదలైన ప్రాథమిక దర్యాప్తు నేడు మధ్యాహ్నం ఓ దశకు చేరుకోవడంతో ఆమె భౌతికకాయాన్ని విడుదల చేసేందుకు అవసరమైన అన్ని పత్రాలను అక్కడి అధికార యంత్రాంగం దుబాయ్ లో వున్న భారత రాయబార కార్యాలయ సిబ్బందికి, బోనీ కపూర్ కి అందజేశారు. ఈ పేపర్స్ అందుకున్న తర్వాత ఎంబాల్మింగ్ ప్రక్రియ ఒక్కటే మిగిలివుంది. ఈ ఎంబాల్మింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే భౌతికకాయాన్ని తరలించేందుకు సర్వం సిద్ధం అయినట్టు పరిగణించాల్సి వుంటుంది. అయితే, ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకుని భౌతికకాయాన్ని ముంబైకి తీసుకొచ్చేలోపు ఇక్కడ చీకటి పడే అవకాశం వుంది.
మంగళవారం అంత్యక్రియలు జరపకపోవడానికి పలు కారణాలు వున్నాయి. అందులో ఒకటి చీకటి పడిన తర్వాత అంత్యక్రియలు జరిపే సంప్రదాయం లేకపోవడమైతే, మరొకటి శ్రీదేవి భౌతికకాయాన్ని కడసారి చూసి, అంతిమ వీడ్కోలు పలికేందుకు ఆమె అభిమానులు, బంధుమిత్రులు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో ముంబైలోని అనిల్ కపూర్ నివాసం వద్ద వేచిచూస్తుండటమే. శ్రీదేవి అభిమానుల సందర్శనార్ధం ఆమె భౌతికకాయాన్ని కొన్ని గంటలపాటైనా అనిల్ కపూర్ నివాసంలో వుంచాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అందువల్లే మంగళవారం శ్రీదేవి భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యే సూచనలు లేవు అనే సమాచారం అందుతోంది.