కర్ణాటక శివమొగ్గ జిల్లా పరిసర ప్రాంతాల్లో టిప్పు సుల్తాన్‌ మైసూర్ యుద్ధంలో వాడిన యుద్ధ సామాన్లు బయట పడ్డాయి. స్థానికంగా పనిచేసుకొనే వారు పురాతనమైన నుయ్యిని తవ్వుతుండగా ఈ సామగ్రి బయటపడడంతో ఆర్కియాలజిస్టులకు సమాచారం అందించారు.  ఆర్కియాలజి శాఖ అధికారి ఆర్‌ రాజేశ్వర నాయక ఆధ్వర్యంలో ఆ తర్వాత ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి. తొలుత తవ్వకాల్లో గన్ పౌడర్ వాసన రాగా.. ఆ తర్వాత మైసూర్ రాకెట్లుగా పేరుగాంచిన ఆయుధ సంపద బయట పడింది. దాదాపు 1000 రాకెట్లు, గుండ్లు ఆ తవ్వకాల్లో వెలుగులోకి వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23-26 సెంటీమీటర్ల పొడవు గల ఈ రాకెట్లను బయటకు తీసుకురావడం కోసం ఒక టీమ్ సైతం ఏర్పడి ఎంతగానో కష్టపడింది. దాదాపు మూడు రోజుల పాటు శ్రమపడి ఈ రాకెట్లను వెలికి తీశారు. ఈ రాకెట్లు క్రీస్తుశకం 18వ శతాబ్దం కాలం నాటివని తెలిపారు. ఈ తవ్వకాలను బిదనూరు కోటకు దగ్గరలో జరిపారు. సాధారణంగా యుద్ధంలో ఉపయోగించే ఈ రాకెట్లలో పొటాషియం నైట్రేట్, చార్కోల్, మెగ్నీషియం పౌడర్ ఉపయోగిస్తారని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలియజేశారు.


ఈ రాకెట్లను సందర్శకుల కోసం శివమొగ్గ ప్రాంతంలోని ఆర్కియాలజికల్ డిపార్టుమెంటు మ్యూజియంలో ఉంచుతామని పురాతత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి రాకెట్లను తయారుచేయడానికి పునాది వేసింది టిప్పుసుల్తాన్ కాలం నాటి యుద్ధరంగ నిపుణులని.. ఆ తర్వాత వడయార్ రాజులు కూడా వీటిని ఉపయోగించేవారని అధికారులు తెలిపారు. టిప్పుసుల్తాన్ 1799లో ఆంగ్లో మైసూరు యుద్ధంలో శ్రీరంగపట్నంలో మరణించిన సంగతి తెలిసిందే.