ప్రముఖ సినీనటుడు, న్యాచురల్ స్టార్ నానికి కారు ప్రమాదంలో గాయాలయ్యాయని తెలుస్తోంది. నాని ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్డు నెం 45 వద్ద ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ కారు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నానితోపాటు నాని తండ్రి, ఇద్దరు అసిస్టెంట్స్, కారు డ్రైవర్ వున్నారని సమాచారం. నాని కారు ప్రమాదంకు సంబంధించిన వార్తా కథనాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో కారుని నాని డ్రైవరే నడిపిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.


ఈ ప్రమాదంలో గాయపడిన నాని.. అక్కడికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో తాను ఒక్కడినే వున్నానని కారు డ్రైవర్ పోలీసులకి చెప్పినప్పటికీ.. కారు నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టగా కారు నాని తండ్రి పేరిట వుందని, ఈ ప్రమాదంలో నాని కూడా గాయపడ్డాడని పోలీసులకి తెలిసినట్టు వార్తా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. నాని ముఖం, ముక్కుపై గాయాలు కావడంతో ప్రస్తుతం అతడు పాల్గొంటున్న కృష్ణార్జునుల యుద్ధం సినిమా షూటింగ్ కి కొంత బ్రేకులు పడే అవకాశాలున్నాయి.