రోడ్డు ప్రమాదంపై స్పందించిన నాని
ఐయామ్ సేఫ్.. ఐ విల్ బీ బ్యాక్ : నాని
న్యాచురల్ స్టార్ నాని తనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై స్పందించారు. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ రోడ్డు నెం45 వద్ద నాని ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కనే వున్న ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో అతడికి గాయాలయ్యాయనే వార్త అభిమానులని కలవరపాటుకి గురిచేసింది. చాలా ఆలస్యంగా బయటికి పొక్కిన ఈ వార్త గురించి తెలుసుకున్న నాని సన్నిహితమిత్రులు, అభిమానులు అతడిని పరామర్శించడం మొదలుపెట్టారు.
తనకు ప్రమాదం జరిగిందని తెలిసి ఆందోళన చెందుతున్న అభిమానులు, సన్నిహితమిత్రులకి ట్విటర్ ద్వారా జవాబు ఇచ్చిన నాని.. తనకు ఏమీ కాలేదని ఓ ట్వీట్ చేశారు. అక్కడక్కడా చిన్నపాటి గాయాలు తప్పితే తాను సురక్షితంగానే వున్నానని క్లారిటీ ఇచ్చారు. 'ఓ వారం రోజులపాటు కృష్ణార్జున యుద్ధం సినిమా షూటింగ్‌కి చిన్న బ్రేక్.. ఆ తర్వాత మళ్లీ ఐ విల్ బీ బ్యాక్' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు నాని.