రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో 2009లో వచ్చిన కామెడీ డ్రామా చిత్రం "త్రీ ఇడియట్స్" ఎంత పెద్ద హిట్టో మనకు తెలియంది కాదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట దర్శకులు. చేతన్ భగత్ నవల "వన్ పాయింట్ సమ్ వన్"ను కొంతవరకు ప్రేరణగా తీసుకొని తెరకెక్కిన ఈ చిత్రంలోని అమీర్ ఖాన్, మాధవన్, షర్మన్ జోషి పాత్రలకు యువత బ్రహ్మరథం పట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఐటి విద్యార్థుల జీవితాన్ని బహిర్గతం చేస్తూ.. థియరీ కంటే ప్రాక్టికల్ విద్యకే భవిష్యత్తు ఉందని చాటి చెప్పిన ఈ చిత్రం ఎన్నో బాక్సాఫీసు రికార్డులను కూడా తిరగరాసింది. చైనాలో కూడా తన సత్తా చాటింది. విధు వినోద్ చోప్రా నిర్మాతగా వ్యవహరించిన "త్రీ ఇడియట్స్" చిత్రాన్ని 55 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా.. ఈ చిత్రం దాదాపు రూ.500 కోట్లకు పైగానే వసూలు చేసింది.


ప్రస్తుతం రాజ్ కుమార్ హిరాణీ సంజయ్ దత్ బయోపిక్ "సంజూ" చిత్రాన్ని రిలీజ్ చేసే పనిలో తలమునకలై ఉన్నారు. ఈ క్రమంలోనే తనకు "త్రీ ఇడియట్స్" చిత్రానికి సీక్వెల్ చేయాలని ఉందని.. ఆ ప్రయత్నాన్ని త్వరలోనే మొదలుపెడతానని చెప్పారని సమాచారం. గతంలో హిరాణీ "మున్నాభాయ్" చిత్రానికి మూడో సీక్వెల్ కూడా తీస్తానని ప్రకటించారు. అయితే ఆ ప్రయత్నం ఇంకా సెట్స్ మీదకి వెళ్లలేదు. హిరాణీ దర్శకత్వం వహించిన "త్రీ ఇడియట్స్" చిత్రాన్నే శంకర్ "నన్బన్" పేరుతో విజయ్ హీరోగా తమిళంలో రీమేక్ చేశారు.