వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా ద‌ర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) తెరకెక్కిస్తున్న చిత్రం ' మ‌ణిక‌ర్ణిక‌'. బాలీవుడ్‌ బ్యూటీ కంగనారనౌత్‌ టైటిల్‌ రోల్‌ పాత్రలో, సోనుసుద్ సదాశివ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా బాలీవుడ్‌తో పాటు, దక్షిణాది భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా కొనసాగుతున్నది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమ్మర్లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా 'మ‌ణిక‌ర్ణిక‌' చిత్రం విడుదల తేదీని యూనిట్ ఖరారు చేసింది. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. విఎఫ్ఎక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు నిర్మాతలు.


ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు చాలా కీలకం. ఈ మూవీలోని యుద్దాల్ని తీయడం కోసం హాలీవుడ్ స్టంట్ కోరియోగ్రఫర్ నిక్ పావెల్‌ను రంగంలోకి దింపారని సమాచారం. ఈయన 300 యోధులు, బ్రేవ్ హార్ట్, గ్లాడియేటర్ వంటి సినిమాలకు పనిచేశారు.


కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా.. శంకర్- ఎహసాన్- లాయ్‌లు సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. కాగా ఇదే రోజు హృతిక్ రోషన్ నటించిన 'సూపర్ 30' కూడా విడుదల కానుంది. అటు క్రిష్ తెలుగులో 'ఎన్టీఆర్ బయోపిక్' కు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ సతీమణి బసవతారం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు.