గమ్యం, వేదం, కంచె లాంటి సినిమాలతో తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ సొంతం చేసుకొని చిత్రాలు తీసిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. "గౌతమపుత్ర శాతకర్ణి" సినిమాను బాలయ్యబాబుతో చేసిన క్రిష్  హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన "గబ్బర్" సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. తాజాగా క్రిష్ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న "ఎన్టీఆర్" బయోపిక్ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తారని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. గతంలో ఈ చిత్రానికి దర్శకుడిగా తేజ సైన్ చేసినప్పటికి కొన్ని అనివార్య కారణాలతో ఆయన ఆ చిత్రం నుండి తప్పుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను క్రిష్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ ‘నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశులు చెప్పారు. నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెప్తున్నాం. చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది.. ప్రతి ప్రాణానికీ ఒక కథ ఉంటుంది.. ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది’ అని తెలిపారు.


క్రిష్ "ఎన్టీఆర్" బయోపిక్ చిత్ర దర్శకుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న క్రమంలో ఎన్‌బీకే ఫిలిమ్స్ ప్రత్యేకంగా యూట్యూబ్‌లో ఓ వీడియోని విడుదల చేసింది. "జనని భారతి మెచ్చ..జగతి హారతులెత్త.. జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా.. రణభేరి మ్రోగించె తెలుగోడు.. జయగీతి నినదించె మొనగాడు ఎన్టీఆర్" అనే నటసార్వభౌముడి ఘనతను చాటే చిరుకవితతో సాగే ఈ వీడియో ఇప్పటికే నందమూరి అభిమానులను సోషల్ మీడియాలో ఎంతగానో అలరిస్తోంది.