మెగాస్టార్ చిరంజీవి తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తనయుడు సోషల్ మీడియా ద్వారా తన తండ్రికి విష్ చేశారు. ఈ సందర్భంగా తన తండ్రితో తాను దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఇంత గొప్ప, విజయవంతమైన, ఆదర్శవంతమైన సినీ ప్రయాణాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ఈ సందర్భంగా రామ్ చరణ్ తన పోస్టులో పేర్కొన్నారు. సినిమా పరిశ్రమతో పాటు తను కూడా ఎప్పుడూ చిరుని ప్రేమిస్తూనే ఉంటారని.. ఈ సందర్భంగా రామ్ చరణ్ తెలియజేశారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి చిత్రం "సైరా నరసింహారెడ్డి" చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. నయనతార, సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ సేతుపతి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నాజర్, ఆశిష్ విద్యార్థి లాంటి పెద్ద నటీనటులంతా కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ కథను అందిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 


తన తొలి చిత్రం ప్రాణంఖరీదుతో 22 సెప్టెంబరు 1978లో నటనా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించిన చిరంజీవి ఇప్పటికి 151 చిత్రాల్లో నటించారు. తన కెరీర్‌‌లో పది ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు మూడు సార్లు నంది అవార్డులు, ఒకసారి సినిమా ఎక్స్ ప్రెస్ అవార్డు అందుకున్నారు. 2016లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. 2006లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేటును కూడా అందుకున్న చిరంజీవి.. ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌కి అతిథిగా వెళ్లిన తొలి తెలుగు నటుడిగా కూడా వార్తల్లోకెక్కారు. 2006లో భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.