హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాకిచ్చింది. కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ వివాదాస్పదంగా ఉందని.. ఆ సినిమా టైటిల్ మార్చాలని కోర్టు ఆదేశించిన అనంతరం వర్మ తన సినిమాకు ''అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'' అని టైటిల్ మార్చుకున్నాడు. టైటిల్ అయితే మార్చాడు కానీ అందులో ఉన్న కథాంశాన్ని, సన్నివేశాలను మార్చలేదు. అయితే, ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు.. సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, వివాదాస్పద అంశాలున్నాయని అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ప్రముఖులను కించపరిచే సన్నివేశాలు ఉన్న కారణంగా ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేమని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. సినిమాకు సర్టిఫికెట్ వస్తే.. సినిమాను విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్న రాంగోపాల్ వర్మ... సెన్సార్ బోర్డు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. 


సెన్సార్ బోర్డు తీరుపై రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. సెన్సార్ నిబంధనల పరంగా ఆలోచిస్తే, ఏ సినిమా విడుదల కాలేదని.. కానీ ఎందుకో తన సినిమాకే అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. సెన్సార్ బోర్డు నిర్ణయంపై సవరణ కమిటీకి వెళ్లాలని 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' చిత్ర నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలిపారు.