టాలీవుడ్‌కి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ నిర్మాత కన్నుమూత
ముఠా మేస్త్రి.. అల్లరి అల్లుడు.. నేనున్నాను.. లాంటి సూపర్ హిట్ తెలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి (62) చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం ఆరున్నర గంటలకు కన్నుమూశారు.
ముఠా మేస్త్రి.. అల్లరి అల్లుడు.. నేనున్నాను.. లాంటి సూపర్ హిట్ తెలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి (62) చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం ఆరున్నర గంటలకు కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయనకు ఇటీవలే ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది. 1985లో ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అక్కినేని నాగార్జునతో ఆయనకు అనుబంధం ఎక్కువ. ఆయనతో దాదాపు 10 సినిమాలకు పైగా నిర్మించారు. ఆయన ప్రొడ్యూస్ చేసిన ఆఖరి చిత్రం "గ్రీకువీరుడు" 2013లో విడుదలైంది.
శోభన్ బాబు హీరోగా నటించిన "కార్తీక పౌర్ణమి" శివప్రసాద్ రెడ్డికి నిర్మాతగా తొలి చిత్రం. తర్వాత మళ్లీ శోభన్ కాంబినేషన్‌లో "శ్రావణ సంధ్య" చిత్రాన్ని కూడా నిర్మించారు. నాగార్జున, జుహీచావ్లా హీరో హీరోయిన్లుగా నటించిన "విక్కీదాదా" సినిమా, శివప్రసాద్ రెడ్డికి నాగ్‌తో తొలి సినిమా. సీతారామరాజు, ఎదురులేని మనిషి, బాస్, కింగ్, కేడీ, రగడ, దడ మొదలైనవి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఇతర చిత్రాలు.
శివప్రసాద్ రెడ్డి మరణంపై టాలీవుడ్ ప్రముఖలెందరో తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఓ మంచి నిర్మాతను టాలీవుడ్ పరిశ్రమ కోల్పోయిందని తెలిపారు. శివప్రసాద్ రెడ్డికి ఇద్దరు కుమారులున్నారు. శివప్రసాద్ రెడ్డి చాలా దయగల వ్యక్తిత్వం కలవారని.. ఆయన మరణం చాలా బాధాకరమని.. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని ప్రముఖ సినీ రచయిత బీవీఎస్ రవి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆయన శివప్రసాద్ నిర్మించిన సీతారామరాజు చిత్రానికి అసిస్టెంట్ రైటర్‌గా పనిచేయడంతో పాటు.. కింగ్ చిత్రానికి మాటల రచయితగా కూడా పనిచేశారు.