దుబాయ్ హోటల్లో శ్రీదేవి మృతి: అసలు ఏం జరిగింది ? ఎలా జరిగింది ?
జుమెరియా ఎమిరేట్స్ టవర్ హోటల్లో బస చేసిన శ్రీదేవి
యావత్ భారతీయుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న అతిలోక సుందరి శ్రీదేవి అకాల మృతి ఆమె అభిమానులకు అనుకోని షాక్ ఇచ్చింది. నిండు పున్నమిలాంటి నవ్వుతో, నిత్య యవ్వనంగా కనిపించే శ్రీదేవి ఇలా గుండెపోటుతో మృతిచెందడం ఏంటా అనేదే ఇప్పుడు ఆమె అభిమానులని తొలిచివేస్తోన్న ప్రశ్న. మరి అసలు ఏం జరిగింది ? ఎలా జరిగింది ? శ్రీదేవి మృతిచెందిన రోజు రాత్రి ఆమె ఎక్కడుంది ? అనే ప్రశ్నలే ఆమె అభిమానులని వేధిస్తున్నాయి. మూడు రోజుల క్రితం తన తోబుట్టువు కొడుకు అయిన మోహిత్ మర్వ పెళ్లికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడ పెళ్లి వేడుకలు ముగిసిన తర్వాత కూడా చిన్న కూతురు ఖుషీ కపూర్, భర్త భోనీ కపూర్‌తో కలిసి దుబాయ్‌లోనే వుండిపోయింది.
జుమెరియా ఎమిరేట్స్ టవర్ హోటల్లో బస చేసిన శ్రీదేవి శనివారం అర్ధరాత్రి సమయంలో వాష్ రూమ్‌కి వెళ్లి అక్కడే గుండెపోటుకు గురై స్పృపతప్పిపడిపోయారు. వాష్ రూమ్‌లో స్పృహకోల్పోయిన శ్రీదేవిని అక్కడికి సమీపంలోని రషీద్ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్టు ఆస్పత్రివర్గాలు స్పష్టంచేశాయి.
శ్రీదేవి మృతిపై ఇప్పటివరకు అతడి కుటుంబసభ్యులు ఎవ్వరూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. శ్రీదేవి మృతి గురించి దుర్వార్త అందిన వెంటనే ఈ కష్ట కాలంలో భోనీ కపూర్‌కి అండగా నిలిచేందుకు అతడి సోదరుడు సంజయ్ కపూర్ సహా ఇతర సమీప బంధువులు వెంటనే దుబాయ్ బయల్దేరారు.
శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ కూడా ఆమెతో ఈ పెళ్లి వేడుకకు వెళ్లాల్సి వున్నప్పటికీ.. ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న మొదటి చిత్రం 'ధడకన్' ప్రస్తుతం షూటింగ్ చివరి స్టేజ్‌లో వున్నందున ఆమె వెళ్లలేకపోయింది. శ్రీదేవి మృతి వార్త తెలియడంతో షూటింగ్స్‌తో బిజీగా వున్న సినీ ప్రముఖులు అందరూ ఒక్కొక్కరుగా ముంబైకి చేరుకుంటున్నారు. నేటి రాత్రికి శ్రీదేవి భౌతిక కాయం ముంబైకి చేరనుంది.