అస్సాంలో కురుస్తోన్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. బ్రహ్మాపుత్రా నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. రహదారి వ్యవస్థ దెబ్బతినడంతో అనేక గ్రామాల మధ్యల సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలోనే తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ చిన్న నది ప్రవాహాన్ని దాటబోయిన ఓ మహిళ నీటిలో ఒక చిన్నారితోసహా మునిగిపోబోయింది. అది గమనించిన ఉత్తమ్ తటి అనే ఓ 11 ఏళ్ల బాలుడు వెంటనే నదిలోకి దూకి ఆ మహిళతోపాటు ఆమె బిడ్డను కూడా రక్షించి ఒడ్డుకు చేర్చాడు. 11 ఏళ్ల బాలుడు ప్రాణాలకు తెగించి చేసిన సాహసం గురించి తెలుసుకున్న జిల్లా అధికార యంత్రాంగం అతడి గురించి పై అధికారులకు తెలియజేశారు. 


ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ లఖి జ్యోతి దాస్ స్పందిస్తూ.. ఉత్తమ్ గురించి డిప్యూటి కమిషనర్‌తో మాట్లాడామని, అతడి సాహసం గురించి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని అన్నారు. సోనిత్‌పూర్‌లోని మిస్సమరిలో ఈ ఘటన చోటుచేసుకుంది.