పాన్, ఆధార్ సమర్పించని ఉద్యోగులకు భారీ షాక్!
తాము పనిచేస్తున్న కంపెనీలకు పాన్ కార్డ్, ఆధార్ వివరాలను సమర్పించని ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. రూ.2.5 లక్షలు, అంతకంటే ఎక్కువ వార్షిక వేతనం పొందే ఉద్యోగులు 20 శాతం జీతాన్ని పన్ను కింద చెల్లించాల్సి ఉంటుందని సర్క్యూలర్ జారీ అయింది.
ఉద్యోగులకు తరచుగా ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ఆధార్, పాన్ అనుసంధానం ఇలా ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. ఉద్యోగం మినహా వ్యాపారాలు, ఇతరత్రా పనులు చేసి జీవనం సాగించేవారికి ఇలాంటి చిక్కులు చాలా తక్కువ. విషయం ఏమిటంటే.. రూ.2.5 లక్షలు, అంతకంటే ఎక్కువ వార్షికంగా సంపాదించే ఉద్యోగులు తమ ఆధార్ వివరాలు, పాన్ కార్డ్ వివరాలు తాము పనిచేస్తున్న సంస్థకు వెల్లడించాలని లేనిపక్షంలో జీతంలో 20శాతం నగదును పరిహారంగా చెల్లించాల్సి వస్తుందట. ఈ వివరాలు సంస్థకు తెలియజేయని ఉద్యోగులకు జీతాలు ఇచ్చే సమయంలో టీడీఎస్ చేయాలని ఆదాయపు పన్ను వాఖ అన్ని కంపెనీ యాజమాన్యాలకు స్పష్టం చేసింది.
Also Read: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ సరికొత్త సదుపాయం
గతవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 16నుంచి ఇది అమల్లోకి రానుంది. ఆదాయపు పన్ను ప్రకారం ఉద్యోగులు పాన్ కార్డు వివరాలను కంపెనీలకు అందజేయాలి. లేకపోతే చట్టంలో వర్తించే పన్ను ప్రకారం గానీ, లేక జీతం మొత్తంలో 20శాతంగానీ పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను వివరాలు సబ్మిట్ చేసే నేపథ్యంలో ఈ సర్క్యూలర్ రావడం గమనార్హం. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 206 ఏఏ సెక్షన్ ప్రకారం ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా ఆధార్, పాన్ వివరాలు అందజేయాలి.
మీకు వచ్చే జీతం 30శాతం పన్ను కట్టే శ్లాబ్‌లో ఉంటే యావరేజ్ ట్యాక్స్ రేట్ కట్టాల్సి ఉంటుంది. అయితే 20శాతం కంటే ఎక్కువ ట్యాక్స్ రేట్ శ్లాబ్ ఉద్యోగులకు హెల్త్, ఎడ్యూకేషన్ సెస్ కింద అదనంగా 4శాతం వసూలు చేస్తారు. అయితే కచ్చితంగా రూల్స్ పాటించాల్సిందేనని యాజమాన్యాలకు సీబీడీటీ, ఆదాయపు పన్నుశాఖలు సూచించాయి.