గుడ్ న్యూస్.. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ సరికొత్త సదుపాయం

కంపెనీ మారిన తర్వాత ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యల్లో పాత కంపెనీలో చివరి తేదీని ఈపీఎఫ్ పోర్టల్‌లో నమోదు చేయడం ఇబ్బందిగా ఉండేది. అయితే ఇకనుంచి ఉద్యోగులే తమ క్లోజింగ్ డేట్‌ను నమోదు చేసుకునే వెసులుబాటును కల్పించారు.

Updated: Jan 24, 2020, 02:40 PM IST
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ సరికొత్త సదుపాయం

ఉద్యోగులు కంపెనీ మారే సందర్భంలో ఎదుర్కొనే సమస్యల్లో ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలోని డబ్బులను విత్ డ్రా చేసుకోవడం ఒకటి. కొత్త సంస్థకు ఉద్యోగులు పీఎఫ్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే కచ్చితంగా పాత కంపెనీలో చివరి తేదీ (డేట్ ఆఫ్ ఎగ్జిట్ లేక క్లోజింగ్ డేట్) నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో గతంలో పనిచేసిన సంస్థనే డేట్ ఆఫ్ ఎగ్జిట్ వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని సంస్థలు ఆ తేదీని ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయకపోవడంతో ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. 

ఇకనుంచి ఉద్యోగులు సొంతంగా వారే పాత కంపెనీ ఎగ్జిట్ డేట్‌ను EPFO వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇకనుంచి ఉద్యోగులే తమ ఎగ్జిట్ డేట్‌ను నమోదు చేయవచ్చు. కానీ సంస్థ నుంచి వెళ్లిపోయిన రెండు నెలల తర్వాతే ఆ వివరాలు ఆప్ డేట్ చేసుకోవడం కుదురుతుంది. గతంలో పనిచేసిన కంపెనీ చివరి పీఎఫ్ ఉద్యోగుల ఖాతాలో జమ చేసిన రెండు నెలలకు ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది.

ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ కింది విధంగా చేసుకోవచ్చు
స్టెప్ 1:  ఉద్యోగులు తమ యూఏఎన్‌ నంబర్‌ (UAN number), పాస్‌వర్డ్‌తో ఈపీ లాగిన్‌ అవ్వాలి.
స్టెప్ 2: ‘మేనేజ్’ ఆప్షన్‌లో కనిపించే ‘మార్క్ ఎగ్జిట్‌’ అనే ఆప్షన్‌ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 3: సెలక్ట్ ఎంప్లాయ్‌మెంట్ డ్రాప్ డౌన్ నుంచి ఫీఎఫ్ అకౌంట్ నెంబర్‌ను సెలక్ట్ చేయాలి 
స్టెప్ 4: అక్కడ గతంలో పనిచేసిన కంపెనీలో జాబ్ ఎందుకు మానేశారో సరైన కారణాన్ని, డేట్ ఆఫ్ ఎగ్జిట్ (పాత కంపెనీలో చివరి వర్కింగ్ తేదీ)ను నమోదు చేయాలి.
స్టెప్ 5: వివరాలు నమోదు చేసిన తర్వాత ‘రిక్వెస్ట్ ఓటీపీ’ మీద క్లిక్ చేస్తే ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని చెక్ బాక్స్‌లో నింపి అప్‌డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 6: ఓకే మీద క్లిక్ చేస్తే క్లోజింగ్ డేట్ (డేట్ ఆఫ్ ఎగ్జిట్) నమోదు ప్రాసెస్ పూర్తవుతుంది. 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..