అహ్మదాబాద్: గుజరాత్‌లో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. పర్యాటకులను అంబాజీ దేవాలయ సందర్శనకు తీసుకెళ్లి తిరిగొస్తుండగా కొండ ప్రాంతంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా తిరగబడింది. బనస్కాంత జిల్లాలోని అంబాజీ పట్టణంలోని త్రిశూలియ ఘాట్ సమీపంలో సోమవారం ఈ ఘటన జరిగిందని ఘటనా స్థలంలో సహాయ చర్యలు పర్యవేక్షిస్తోన్న సీనియర్ పోలీస్ ఆఫీసర్ అజిత్ రజియన్ తెలిపారు. రోడ్డుపై బురద ఉన్న చోట డ్రైవర్ సడెన్ బ్రేకులు వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని ఘటనాస్థలం వద్దే ఉన్న ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 70మందికిపైగా ప్రయాణికులు ఉండగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందిని క్రేన్స్ సహాయంతో సురక్షితంగా రక్షించినట్టు రజియన్ పేర్కొన్నారు. బాధితులందరూ ఆనంద్ తాలూకాలోని అంక్లావ్ గ్రామానికి చెందినవారే. బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.



 


ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. గుజరాత్‌లోని సంబంధిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశానని, బాధితులకు త్వరితగతివ స్వాంతన చేకూరేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించామని అన్నారు.