హైదరాబాద్‌లో బీజేపీ పార్టీ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పాలనపై విమర్శలు కురిపించారు. టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించిన అమిత్ షా.. బీజేపీ ఈసారి తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని కేసీఆర్ అంటున్నారని.. కానీ రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లకు అవకాశం లేదని.. అయినా తెలంగాణ సీఎం అలాంటి ప్రమాణాలు ఎందుకు చేస్తున్నారని అమిత్ షా ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014లో కూడా కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారని.. కానీ ఆడిన మాట తప్పారని అమిత్ షా తెలిపారు. రైతాంగానికి కేసీఆర్ చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదని తెలిపిన అమిత్ షా.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణాలో 4200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆడిన మాట తప్పడం కేసీఆర్‌కి మాత్రమే సాధ్యమైందని అమిత్ షా ధ్వజమెత్తారు. 


తెలంగాణలో 119 సీట్లలో తాము పోటీ చేయనున్నట్లు అమిత్ షా తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తానని కేసీఆర్ ప్రకటించడం పట్ల కూడా అమిత్ షా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వెళ్లడం కేసీఆర్‌కి మాత్రమే సాధ్యమైందని తెలిపారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకొని తెలంగాణ యూనిట్ బీజేపీ ప్రెసిడెంట్ కె లక్ష్మణ్ మాట్లాడారు. పాతబస్తీలోని హిందూ దేవాలయాలను కూడా అమిత్ షా సందర్శిస్తారని ఆయన అన్నారు. త్వరలో మహబూబ్ నగర్, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా బీజేపీ సమావేశాలు నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు.