ఆర్యభట్టకు 43 ఏళ్లు..కొన్ని ఆసక్తికర విశేషాలు
ఇస్రో ఆధ్వర్యంలో ఆర్యభట్ట పేరుతో నిర్మించిన శాటిలైటును అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి నేటితో 43 ఏళ్లు కావస్తోంది.
ఇస్రో ఆధ్వర్యంలో ఆర్యభట్ట పేరుతో నిర్మించిన శాటిలైటును అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి నేటితో 43 ఏళ్లు కావస్తోంది. భారతీయ పురాతన ఖగోళశాస్త్రవేత్త ఆర్యభట్ట జ్ఞాపకార్థం ఈ ఉపగ్రహానికి ఆ పేరుతో నామకరణం చేసారు.
1975 సంవత్సరంలో మన దేశానికి శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే సాంకేతికవిజ్ఞానం ఇంకా అందుబాటులో లేదు. ఆ సమయంలో సోవియట్ యూనియన్ సహాయంతో రష్యా ప్రయోగకేంద్రం నుండి ఈ ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది. ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త యూ ఆర్ రావు ఈ ప్రాజెక్టుకి సారధ్యం వహించారు. ఈ ఉపగ్రహం గురించి మనం కూడా కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం
స్పుత్నిక్ 1 అనే ఉపగ్రహం ప్రపంచంలోనే తొలి శాటిలైట్‌గా పేరుగాంచింది. ఆ తర్వాత 18 సంవత్సరాల తర్వాత మళ్లీ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన శాటిలైట్ ఆర్యభట్ట మాత్రమే.
భారత అంతరిక్షశాస్త్ర పితామహుడు విక్రమ్ సారాభాయ్ తన శిష్యుడు యూఆర్ రావుతో పంచుకున్న ఓ ఆలోచన.. ఆర్యభట్ట నిర్మాణానికి దోహదపడింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించి ఉపగ్రహం తయారుచేయించాలన్నది సారాభాయ్ కోరిక.
ఆర్యభట్టను సోవియట్ దేశం నుండి అంతరిక్షంలోకి పంపించడం కోసం, భారతదేశం రష్యాతో పలు ఒప్పందాలు చేసుకొంది. ఆ ఒప్పందాల్లో భాగంగానే రష్యా తమ నౌకలను ట్రాకింగ్ చేయడానికి భారతదేశ పోర్టులను ఉపయోగించుకుంది.
ఈ ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే పేరు పెట్టకముందే ఇందిరాగాంధీ వద్దకు మైత్రి, జవహర్ అనే మరో రెండు పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. కానీ ఆమె ఆర్యభట్ట పేరును సిఫార్సు చేశారు.
ఆర్యభట్ట నిర్మాణానికి అప్పట్లోనే రూ.3.5 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చుపెట్టింది.
ఆర్యభట్ట ఉపగ్రహాన్ని నిర్మించడానికి 30 నెలల సమయం తీసుకున్నారు.
ఆర్యభట్ట కేవలం 5 రోజులు మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత విద్యుత్ ఫెయిల్యూర్ వల్ల ఆగిపోయింది.
ఆ తర్వాత 17 సంవత్సరాల తర్వాత 10 ఫిబ్రవరి 1992 తేదిన భూమిని చేరుకుంది ఆర్యభట్ట.
ఆర్యభట్ట ఉపగ్రహం యొక్క చిత్రాన్ని 1976 మరియు 1997 భారతదేశపు 2 రూపాయల కరెన్సీనోట్లతో పాటు పలు 1 రూపాయి నోట్లపై ముద్రించారు.
ఆర్యభట్ట ఉపగ్రహం 26 పార్శతలాలు కలిగి ఉండడంతో పాటు..1.5 మీటర్ల వ్యాసంతో నిర్మించబడింది