గోమూత్రాన్ని ఆన్ లైన్లో అమ్మనున్న అమెజాన్
గోమూత్రంతో పాటు ఆవు పేడతో తయారయ్యే పలు ఔషధాలు, సబ్బులను కూడా ఇక అమెజాన్ ఆన్‌లైన్‌లో విక్రయించే అవకాశం ఉందని.. ఈమేరకు ఆ సంస్థలో సంప్రదిపులు జరిపామని ఆర్ఎస్ఎస్ సపోర్టుతో పనిచేస్తున్న ఓ కంపెనీ ప్రకటించింది.
గోమూత్రంతో పాటు ఆవు పేడతో తయారయ్యే పలు ఔషధాలు, సబ్బులను కూడా ఇక అమెజాన్ ఆన్‌లైన్‌లో విక్రయించే అవకాశం ఉందని.. ఈమేరకు ఆ సంస్థలో సంప్రదింపులు జరిపామని ఆర్ఎస్ఎస్ సపోర్టుతో పనిచేస్తున్న ఓ కంపెనీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో దీన్ దయాళ్ దామ్ పేరుతో నమోదైన ఈ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తాము గోమూత్రం, ఆవుపేడతో తయారయ్యే ఔషధ ఉత్పత్తులను తయారుచేస్తున్నామని.. వాటిని ఇప్పుడు వినియోగదారులు ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తున్నామని తెలపడం జరిగింది. తాము తమ ఔషధశాలకు "దీన్ దయాళ్ కామధేను గోశాల ఫార్మసీ" అని నామకరణం చేశామని.. ఈ ఫార్మసీలో జ్వరం, అజీర్తి, తలనొప్పితో పాటు దీర్ఘకాలిక రోగాలకు కూడా మందులు లభిస్తాయని తెలిపారు.
అలాగే తాము ఈ ఔషధశాలకు అనుబంధంగా కుర్తాల బిజినెస్ కూడా చేస్తున్నామని.. అమెజాన్ సౌకర్యం లేని ప్రాంతాలకు తాము పోస్టు ద్వారా కూడా ఔషధాలు డెలివరీ చేయగలమని దీన్ దయాళ్ దామ్ ప్రతినిధులు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా ఈ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఈ సంస్థలో స్థానిక పల్లెటూర్లకు చెందిన మహిళలందరూ పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఇంకో వారంలో తమ ప్రకటనలు అమెజాన్ వెబ్ సైటులో కూడా దర్శనమిస్తాయని ఈ సంస్థ ప్రతినిధి ఘనశ్యామ్ గుప్తా తెలిపారు. గతంలో నరేంద్ర మోదీ, ఆదిత్యనాధ్ మొదలైనవారు కూడా తన ఉత్పత్తులను ప్రచారం చేశారని ఆయన అన్నారు. హెల్త్, బ్యూటీ, అపెరెల్ రంగాల్లో ఇప్పుడిప్పుడు తమ సంస్థ అడుగులు వేస్తుందని.. ఘనవతి, పంచవగ్య చూర్ణం, చావన్ ప్రాశ్ మొదలైనవి కూడా తాము తయారుచేస్తున్నామని ఆయన అన్నారు.