జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తొంది. ఈమేరకు లోక్‌సభతో పాటే రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని న్యాయ కమిషన్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఎనిమిది రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్డీఏ అధికారంలో ఉన్నవాటిలో ఏడు రాష్ట్రాలు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిజోరాం ఈ జాబితాలో ఉన్నాయి. లోక్‌సభ, అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే వ్యయం తగ్గడంతో పాటు అనేక ప్రయోజనాలు ఉంటాయని అమిత్ షా అభిప్రాయపడ్డారు.


బీజేపీ పార్టీ పాలనలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీల గడువు వచ్చేఏడాది జనవరితో ముగుస్తుంది. అయితే, కొద్దినెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలతోపాటు ఈ రాష్ర్టాలకు ఎన్నికలు నిర్వహించాలని, అంతవరకు గవర్నర్ పాలన విధించాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో కూడా ముందస్తుగా ఎన్నికలకు అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు బీహార్‌లో కూడా ముందస్తు ఎన్నికల నిర్వహణకు చర్చలు జరుగుతున్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.