కమల్ హాసన్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో రానున్నారు. సాయంత్రం మదురైలో పార్టీ స్థాపించబోతున్నారు. ఈరోజు ఉదయం రామేశ్వరం చేరుకొని ఏపీజే అబ్దుల్ కలాం ఇంటికి వెళ్లి, ఆయన సోదరుడితో సంభాషించారు. కలాం కుటుంబ సభ్యుల ఆశీస్సులు తీసుకున్నారు. ఆతరువాత జాలర్లతో సమావేశమయ్యారు. అనంతరం స్థానిక హయత్ ప్యాలెస్ లో విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ- 'నేను మహాత్మా గాంధీ వీరాభిమానిని. అబ్దుల్ కలాం నాకు ఆదర్శం. చంద్రబాబు నాయుడు నా హీరో. నిన్న రాత్రి ఆయన నాకు చంద్రబాబు నాయుడు గారు  ఫోన్ చేశారు. ప్రజలకు ఏమి చేయాలన్న విషయాలపై సలహాలు ఇచ్చారు' అని అన్నారు. యాత్రలో అభిమానులు, కార్యకర్తలు శాలువాలు కప్పుతున్నారని, ఇకపై శాలువాలు కప్పవద్దని.. నేనే మీకు శాలువనై రక్షణగా ఉంటాయని అన్నారు.  


సినిమాలు, రాజకీయాలకు పెద్ద తేడా ఏమీ లేదని, రెండు రంగాలు ఒకటేనని అభివర్ణించిన ఆయన.. రాజకీయాలు బాధ్యతతో కూడుకున్నవని అభిప్రాయపడ్డారు. తాను కలాం చదివిన స్కూల్ కు వెళ్లానని.. కానీ స్కూల్ యాజమాన్యం అనుమతించలేదని అన్నారు. స్కూల్ యాజమాన్యం అడ్డుకున్నా.. ఆయన వద్ద నుండి నేర్చుకోవలసిన విషయాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. నేను సాధారణంగా అంత్యక్రియలకు హాజరుకాను కాబట్టే.. కలాం అంత్యక్రియలకు హాజరుకాలేదని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తమిళనాడు ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. నేను వారి ఇళ్లలో ఒక సభ్యుడిగా ఉండాలనుకుంటున్నానని అన్నారు.