బడ్జెట్ 2018 - జీఎస్టీలో మార్పులు చేయనున్నారా?
ఇంకొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో వ్యాపారవేత్తలు మరో ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఇంకొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో వ్యాపారవేత్తలు మరో ఆశతో ఎదురు చూస్తున్నారు. జీఎస్‌టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) పై కేంద్రం ఏమైనా మెతక వైఖరి కనబరిచే అవకాశం ఉంటుందా అని యోచిస్తున్నారు. గత సంవత్సరం జీఎస్‌టీ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చిన కేంద్రం, కొంతమంది వ్యాపారుల నడ్డి విరిచిన క్రమంలో ఆ పన్ను రద్దు అయితే బాగుంటుందేమో అన్న అభిప్రాయంలో కొందరుండగా.. ఆ పన్ను తగ్గిస్తే బాగుంటుందని కూడా పలువురు భావిస్తున్నారు. కాగా ఇటీవలే పెరుగుతున్న జీఎస్‌టీ వసూళ్ళు పలువురిని ఆశ్చర్యపరుస్తున్నాయి. డిసెంబర్ 1 నుంచి జనవరి 25 వరకు రూ.86,703 కోట్ల జీఎస్‌టీ వసూళ్లు జరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఇప్పటి వరకు 56.30 లక్షల మంది జీఎస్‌టీఆర్ 3బీ రిటర్నులను కూడా దాఖలు చేశారని ఆర్థిక శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఇక రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే.. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీము కింద కొనుగోలు చేసే గృహాలపై నాలుగు శాతం జీఎస్టీ తగ్గడం ఆశాజనకమైన విషయమే. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. 645 చదరపు గజాల ఇండ్లను కొంటేనే ఈ తగ్గింపు వర్తిస్తుంది. జీఎస్‌టీ తగ్గడం వల్ల నిర్మాణ సామగ్రితో పాటు ఇతర సేవలపై డెవలపర్లకు అధికమైన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభిస్తుంది. అయితే జీఎస్‌టీపై ప్రభుత్వ వైఖరి వేరేలా ఉంది. ఇటీవలే భారత ఉప రాష్ట్రపతి జీఎస్‌టీ విధానంపై ప్రశంసల వర్షం కురిపించారు. జీఎస్‌టీ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వల్ల పలు లాభాలు కూడా ఉన్నాయన్నారు. ఇటీవలే ప్రపంచ ఆర్థిక రంగంలో భారత వృద్ధిరేటు 7.3 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలే చెప్పాయని, రానున్న 15 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్ధిక శక్తిగా భారతదేశం అవతరిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.