ఆర్మీని తక్షణమే రంగంలోకి దింపాలి: అరవింద్ కేజ్రీవాల్
గత కొన్ని రోజులుగా ఢిల్లీలో చెలరేగుతున్న హింసపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆర్మీని రంగంలోకి దింపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (CAA) నిరసనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. తాజాగా జరిగిన నిరసనలు, అల్లర్లలో ఇప్పటివరకూ 17 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. జఫ్రాబాద్, మౌజ్ పూర్, చాంద్ బాగ్, భజన్ పురా ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసినా పరిస్థితుల్లో అంతగా మార్పు కనిపించడం లేదు. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
సాధ్యమైనంత మంది ఢిల్లీ ప్రజలకు తాను అందుబాటులో ఉన్నానని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుని పరిస్థితుల అదుపులోకి తీసుకురావాలని కోరుతూ హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఢిల్లీలో భయానక వాతావరణమే కనిపిస్తుందని, పరిస్థితులు అదుపులోకి రావడం లేదని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.
Also Read: ఢిల్లీలో హింసకు 17 మంది బలి
తక్షణమే ఆర్మీని రంగంలోకి దింపడంతో పాటు ఢిల్లీలోని మరిన్ని ప్రాంతాల్లోనూ కర్ఫూ విధించాలని లేఖలో కోరనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. మరోవైపు పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కేంద్ర మంత్రివర్గానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితిని వివరించనున్నారు.
See photos: భీష్మ సక్సెస్ మీట్‌లో రష్మిక మెరుపులు
కాగా, సీఏఏపై నిరసనలు ఉద్రికత్తలకు దారితీసి రెండు వర్గాలు రాళ్లదాడులు చేసుకున్నాయి. దీంతో 150 మందికి పైగా ఈ దాడిలో గాయపడ్డారు. 17 మంది చనిపోగా, మృతుల సంఖ్య పెరిగే సూచనలున్నాయి. ఘజియాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చే రోడ్లను మూసివేశారు. అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో ఢిల్లీలోని పాఠశాలలకు బుధవారం (ఫిబ్రవరి 26) సెలవు ప్రకటించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి