న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స ఆసుపత్రిలో అనారోగ్యంతో నిన్న శనివారం తుదిశ్వాస విడిచిన కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్థివదేహానికి నేడు మధ్యాహ్నం నిగంబోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. అరుణ్ జైట్లీని చివరిసారిగా చూసుకుని ఆయనకు నివాళి అర్పించేందుకు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఢిల్లీలోని కైలాష్ కాలనీలో ఉన్న జైట్లీ నివాసానికి భారీ ఎత్తున తరలివస్తున్నారు. నేడు ఉదయం 9.25 గంటలకు జైట్లీ పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఢిల్లీలోని బీజేపి ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచిన అనంతరం అక్కడి నుంచి అంతిమయాత్రగా నిగంభోద్ ఘాట్‌కి తీసుకెళ్లనున్నారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో జైట్లీ పార్థివదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.  అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ తండ్రి చితికి నిప్పు అంటించి అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నారు.


జగమెరిగిన నేత అరుణ్ జైట్లీ అంతిమయాత్ర కోసం మిలిటరీ ట్రక్కుని పూలతో అలంకరించి సిద్ధం చేశారు. అయితే, జైట్లీ అంత్యక్రియల విషయమై బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డా మాట్లాడుతూ.. సరిగ్గా ఏ సమయానికి జైట్లీ అంత్యక్రియలు చేపట్టాలనే విషయమై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని అన్నారు.