ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి బీజేపి తరపున పోటీ చేస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లీగల్ నోటీసులు పంపించారు. నీలాంటి ముఖ్యమంత్రిని కలిగి వున్నందుకు తాను ఎంతగానో సిగ్గుపడుతున్నానని గౌతం గంభీర్ చేసిన ఓ ట్వీట్‌పై స్పందిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఈ లీగల్ నోటీసులు పంపించారు. 24 గంటల్లోగా గౌతం గంభీర్ తనకు క్షమాపణలు చెప్పకపోతే, ఆ తర్వాతి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. వార్తాపత్రికల్లో, సామాజిక మాధ్యమాల ద్వారా తనకు క్షమాపణలు చెప్పి వాస్తవాలను వెల్లడించాలని అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.


ఈస్ట్ ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపి అభ్యర్థిగా బరిలోకి దిగిన గౌతం గంభీర్‌కి అక్కడ ఆప్ అభ్యర్థిగా పోటీచేస్తోన్న అతిషి మర్లెనాకు మధ్యే ప్రధాన పోటీ అన్నట్టుగా ఇరువురి మధ్య జరుగుతున్న ఆరోపణలు, మాటల యుద్ధం మొదటి నుంచి చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ లీగల్ నోటీసులకు గౌతం గంభీర్ స్పందించి క్షమాపణలు చెబుతాడా లేదా అనేది వేచిచూడాల్సిందే మరి.