అసదుద్దీన్ నోట ప్రధాని మాట; మోడీ, రాహుల్ కంటే కేసీఆర్ బెటర్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసల జల్లు కురిపించారు.
హైదరాబాద్: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని అంశాన్ని ప్రస్తావిస్తూ నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, కేసీఆర్ ఈ ముగ్గురిలో ప్రధాని పదవికి ఒకరిని ఎన్నుకోమంటే తాను కేసీఆర్‌ను ఎన్నుకుంటానని తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఓవైసీపీ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్న నేత కేసీఆర్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలదే హవా అన్న కేసీఆర్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు
ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు వంటివి అని ఎద్దేవ చేశారు. ఈ రెండు పార్టీలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని బాగా అర్థం చేసుకున్న నేతగా అని...ఆయన దేశ ప్రధానిగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని అసదుద్దీన్ వ్యక్తం చేశారు.
తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీ పరోక్షంగా సహకరించుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు ఎంఐఎం పార్టీ పలుమార్లు మద్దతు ప్రకటించిది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రధాని అభ్యర్ధి ఎవరనే చర్చ మొదలైన నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీస్తోంది.