భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్ వర్జియా హిందీ చిత్ర పరిశ్రమపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమను బాలీవుడ్ అని పిలవరాదని.. ఆ పేరును వెంటనే మార్చాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆయన కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌కి ఉత్తరం రాశారు. ఈ పేరును తొలిగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ఆన్‌లైన్‌లో "డోంట్ కాల్ ఇట్ బాలీవుడ్" క్యాంపైన్ కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో కైలాష్ విజయ్ మాట్లాడారు. "ఇటీవలే నన్ను ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ కలవడానికి వచ్చారు. మాటల సందర్భంలో బాలీవుడ్ ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంగా ఆయన ఈ పేరును బిబిసి మీడియా వాళ్లు తొలిసారిగా ప్రచారం చేసినట్లు తెలిపారు. హాలీవుడ్ సినిమాలను హిందీ పరిశ్రమ కాపీ కొట్టి చిత్రాలు తీస్తుందన్న భావనతో ఈ పేరు పెట్టారన్నారు. ఈ పేరు వాడితే మనల్ని మనం కించపరుచుకున్నట్లే. అందుకే ఈ పేరును మనం వాడకపోతే మంచిది" అని కైలాష్ విజయ్ అభిప్రాయపడ్డారు. 


"భారతదేశంలో సత్యజిత్ రే, దాదాసాహెబ్ ఫాల్కే లాంటి వారు గొప్ప చిత్రాలు తీశారు. మన సంప్రదాయాలను అందులో చూపించారు. అలాంటప్పుడు మనం హాలీవుడ్‌ను కాపీ కొట్టడం ఏమిటి? అందుకే ఇలాంటి పదాలు బ్యాన్ చేయాలి. టాలీవుడ్, కోలీవుడ్ లాంటి పదాలు కూడా బ్యాన్ చేయాలి. మీడియా కూడా ఈ పదాలను ప్రచురించకుండా ఉంటే మంచిది" అని కైలాష్ విజయ్ తెలిపారు.