బిచ్చగాళ్ళకు చేతివృత్తుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం: ఢిల్లీ సర్కార్
ఢిల్లీలో బిచ్చగాళ్ళు లేకుండా చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త విధానానికి రూపకల్పన చేసింది.
ఢిల్లీలో బిచ్చగాళ్ళు లేకుండా చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ కొత్త విధానానికి రూపకల్పన చేసింది. యాచకులకు చేతివృత్తుల్లో శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత వారు స్వయంఉపాధి పొందేందుకు కిట్లు కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అందుకోసం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సహాయం తీసుకొని స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
యాచకులను స్వయంఉపాధి దిశగా మళ్లిస్తే వారి సంఖ్య తగ్గే అవకాశముందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ సర్కార్ పేర్కొంది. వీరి కోసం ప్రత్యేకంగా రూపొందించే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో కుట్టు పనులు, చేతివృత్తులు నేర్పిస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా శిక్షణ పొందుతున్న సమయంలో వారికి రోజుకు రూ.250 చొప్పున జీవనభృతిని కూడా అందజేయనున్నారు. గతంలో ఎలాంటి జీవనాధారం లేని బిచ్చగాళ్ళను హోమ్స్‌కు తరలించేవారు. కానీ వారు బయటకు వచ్చి తిరిగి అడుక్కొనేవారు.
ఈ క్రమంలో బిచ్చగాళ్ళ సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావడానికి ఢిల్లీ సర్కారు ప్రయత్నిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకున్న బిచ్చగాళ్లకు ఐడీ కార్డులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వీలైతే వారికి చిన్న మొత్తంలో లోన్స్ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తామని సర్కారు అంటోంది.