యూపీలో భారత్ బంద్.. 400 మంది అరెస్టు..!
ఉత్తర ప్రదేశ్‌లో అనేక ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్ బంద్ కార్యక్రమం సాగింది. యూపీలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగగా.. దాదాపు 40 మంది వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. అందులో పోలీసులు కూడా ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్‌లో అనేక ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్ బంద్ కార్యక్రమం సాగింది. యూపీలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగగా.. దాదాపు 40 మంది వ్యక్తులు తీవ్రగాయాలపాలయ్యారు. అందులో పోలీసులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులకు బులెట్ దెబ్బలు కూడా తగిలాయి. మధ్యాహ్నం నుండి చెలరేగిన గొడవల్లో ఆందోళనకారులు దాదాపు వంద వాహనాలను తగులబెట్టారు.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసుదళాలు దొరికినవారిని దొరికినట్లు అరెస్టు చేసి జీపుల్లో ఎక్కించారు. కొన్ని ప్రత్యేక పోలీసుదళాలు కూడా రంగంలోకి దిగాయి. దాదాపు 448 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కొన్ని చోట్ల పోలీసులు తమ మాట వినని సాధారణ పౌరులపై కూడా తమ ప్రతాపాన్ని చూపారు. హపూర్‌లో షాపు షటర్ దించడానికి ఆసక్తి చూపని వ్యాపారిని తుపాకీతో పేల్చడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. జనాలు భయాందోళనలకు గురయ్యారు.
అలాగే యువకులు మీరట్ జిల్లా వీధుల్లోకి వచ్చి నాటుతుపాకీలు ప్రయోగించినప్పుడు.. పోలీసు దళాలు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నించారు. పరిస్థితి చేయిదాటిపోతుంది అన్న సమయంలో వారిపై కూడా కాల్పులు చేసి.. వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. శోభాపూర్ ప్రాంతంలో పోలీసు అవుట్ పోస్టును కూడా ధ్వంసం చేశారు.
ఈ భారత్ బంద్ ధర్నాల్లో బహుజన సమాజ్ పార్టీతో పాటు సమాజ్ వాదీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరట్ పోలీసులు బీఎస్‌పీ మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా పశ్చిమ యూపీకి చెందిన అనేక ప్రాంతాలు భారత్ బంద్ ద్వారా నష్టాన్ని చవిచూశాయని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.
ఆగ్రాలో నిరసనకారులు బీజేపీ నేతకు చెందిన ఓ హోటల్ పై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు తాజ్‌మహల్‌కు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. విదేశీ టూరిస్టులకు హెచ్చరికలు జారీ చేశారు. వారిని బయటకు పంపించవద్దని స్థానిక హోటళ్ళకు కూడా ఆర్డర్లు జారీచేశారు. అలాగే ఆదిత్యనాథ్ ఇలాకా అయిన గోరఖ్ పూరు ప్రాంతంలో కూడా నిరసన కారులు ఆందోళన చేపట్టారు. అక్కడ పరిస్థితిని అంచనా వేసిన పోలీసుల భారీ స్థాయిలో సెక్యూరిటీ దళాలను మోహరించారు.
భారత్ బంద్ జరుగుతున్న సందర్భంలోనే యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. దళితుల ఉద్దేశాలను గౌరవిస్తూ.. వారి సమస్యలను తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ ముందుంటాయని.. హింసకు పాల్పడేబదులు.. వినతులను తమ వద్దకు తీసుకువస్తే తాము పరిష్కరిస్తామని ఆయన అన్నారు. అయితే హింస జరుగుతుందని తెలిసినా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యమేనని పలు ప్రజా సంఘాలు తెలిపాయి