పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు నేడు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. రాజ్‌ఘాట్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు విపక్షనేతలతో కలిసి నడిచారు. రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాలో యుపిఎ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు గులాం నబీ ఆజాద్‌, అంబికా సోనీ, అహ్మద్‌ పటేల్‌, లోక్‌తాంత్రిక్‌ జనతా దళ్‌ (ఎల్‌జెడి) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తదితరులు పాల్గొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో పెట్రో ధరల పెరుగుదలపై కానీ, రైతుల పరిస్థితిపై గానీ, మహిళలు, మైనారిటీలు, బడుగు వర్గాలపై జరుగుతున్న అకృత్యాలపై కానీ ప్రధాని మోదీ పెదవి విప్పి మాట్లాడటం లేదని విమర్శించారు. ఈ మౌనం ఎందుకని ప్రశ్నించారు. విపక్షాల ఐక్యతే వచ్చే ఎన్నికలలో మోదీ సర్కార్‌కు తగిన గుణపాఠం చెబుతుందన్నారు.


మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం జాతి ప్రయోజనాలతో సంబంధం లేకుండా.. పలు నిర్ణయాలు తీసుకుందని.. వాటి వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని ఎద్దేవా చేశారు. ఇది ప్రభుత్వాన్ని మార్చే సమయమని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు విభేదాలను పక్కనబెట్టి ఏకతాటిపై రావాలని మన్మోహన్‌ కోరారు.


ఇంధనధరలకు నిరసగా సోమవారం భారత్‌ బంద్‌ చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీ(ఎస్‌) సహా 21 విపక్ష పార్టీలు స్వచ్ఛందంగా నేడు బంద్‌లో పాల్గొన్నాయి. బంద్‌ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. బస్సులు రోడ్డెక్కలేదు.