ఇక ఎన్నారైలకూ ఓటుహక్కు..!
భారతదేశంలో ఓటుహక్కుని ఇక ప్రవాస భారతీయులు కూడా వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించిన ప్రజా ప్రాతినిథ్య చట్టం సవరణ బిల్లును పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ అదే బిల్లు అమల్లోకి వస్తే దాదాపు 2 కోట్ల మంది ఎన్‌ఆర్‌ఐలు స్వదేశంలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రవాస భారతీయులు పోస్టల్, ఈ-బ్యాలెట్ల ద్వారా ఓటు వేసేందుకు చట్టం అనుమతి ఉందా? లేకపోతే ఆ చట్టాన్ని సవరించే యోచన ఉందా? అని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం జవాబిచ్చింది. త్వరలోనే ఈ విషయమై బిల్లు ప్రవేశపెడతామని తెలిపింది. కేవలం చట్టంలో నియమాల మార్పు వల్ల ప్రవాస భారతీయులు ఓటు వేయడం కుదరదని, పార్లమెంటులో సవరణ బిల్లు ప్రవేశ పెట్టడమే సరైన ఉపాయమని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై త్వరగతిన నిర్ణయం తీసుకోవాలని జులై 14 తేదీన కేంద్రానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకొనేందుకు కేంద్రం పోల్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.