మధ్యప్రదేశ్‌లోని ఇసాఘర్ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత జగన్నాధ్ సింగ్ రఘువంశీ గత కొంతకాలంగా విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. దాదాపు నాలుగు లక్షల రూపాయలను ఆయన బకాయి పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై వివరణ కోరిన విద్యుత్ శాఖ ఉద్యోగిపై ఆయన నోరు పారేసుకున్నారు. "నా దయా, ధర్మం మీద నువ్వు బ్రతుకుతున్నావు. లేకపోతే నీ మొహంపై నల్ల రంగు పూసి, బూట్లతో కొట్టేవాడిని" అని ఉద్యోగిని జగన్నాధ్ సింగ్ బహిరంగంగా తిట్టగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాటా మాటా పెరిగి, వాదోపవాదాల వరకు ఈ ఘటన వెళ్లింది. అయితే బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను పలువురు బహిరంగంగానే ఖండించారు. ఆయన తన హుందా తనాన్ని మరిచి ప్రవర్తించారని.. ఇలాంటి పనులు నాయకులు చేస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు.


గతంలో కూడా పలువురు బీజేపీ నేతలు ఇలాంటి వివాదాల్లోనే చిక్కుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ మీటింగ్‌కు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్థన్ బాజ్పాయ్ తనను గుర్తించకుండా లోపలికి అనుమతి నిరాకరించినందుకు పోలీసు అధికారిపై మండిపడ్డారు. ఆయనపై నోరు పారేసుకున్నారు కూడా. అలాగే ముజఫర్ నగర్‌లో ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా పోలీసులతో వాదనకు  దిగిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ పై కూడా పలువురు విమర్శలు గుప్పించారు.