సోలోగానే శివసేన పోటీ చేస్తుంది: సుభాష్ దేశాయ్
2019 ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీచేసే ప్రసక్తే లేదని శివసేన మరోసారి తేల్చి చెప్పింది.
ముంబాయి: 2019 ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీచేసే ప్రసక్తే లేదని శివసేన మరోసారి తేల్చి చెప్పింది. శివసేన ఎన్డీఏలోనే కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు అమిత్ షా తాజాగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో శివసేన పార్టీ స్పందించింది. '2019 ఎన్నికలు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జనవరిలోనే చెప్పాం. అప్పటి నుంచి మోదీ, ఫడ్నవీస్ ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నాం' అని ఆ పార్టీ సీనియర్ నేత సుభాష్ దేశాయ్ వెల్లడించారు.
ముంబైలో జరిగిన బీజేపీ 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ చీఫ్ అమిత్ షా మాట్లాడుతూ.. శివసేన వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి ఉండాలని నిజాయతీగా కోరుకుంటున్నట్లు చెప్పారు. దీనిపై శివసేన పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాశ్ దేశాయ్ శనివారం నాడు స్పందించారు. ఇప్పుడు వాళ్లు (భాజాపా) ఎన్డీయే ప్రభుత్వమని అనడం ప్రారంభించారన్నారు. దీన్నిబట్టి వాళ్ళ ఆత్మవిశ్వాసం క్షీణించినట్లు అర్థమవుతోందన్నారు. నవీ ముంబైలో జరిగిన శివసేన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే గతంలో చేసిన ప్రకటననే సుభాష్ దేశాయ్ మళ్లీ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో శివసేన సోలోగానే పోటీ చేస్తుందని ఉద్ధవ్ గతంలో చెప్పారని తెలిపారు. ఆ నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉన్నట్లు.. అందువల్ల శివసేన ఒంటరిగానే పోటీ చేసి, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. శివసేన పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 60 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే..!