2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రణాళికలో భాగంగా దేశవ్యాప్తంగా వున్న మహిళలతో మమేకమయ్యేందుకు పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. బీజేపీ రూపొందిస్తున్న యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇకపై ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడ స్థానిక మహిళలతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకునున్నారని తెలుస్తోంది. మార్చి 12న ప్రధాని మోదీ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. వారాణాసి పర్యటనతోనే ఈ యాక్షన్ ప్లాన్‌ని అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. 


ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే, మాక్రోన్ పర్యటనలో చివరి రోజైన 12వ తేదీనే మాక్రోన్‌తో కలిసి వారణాసిలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. ఇదే పర్యటనలో వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలతో సమావేశం కానున్నారు. తాను అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి, సమస్యల పరిష్కారం, మౌళిక వసతుల రూపకల్పనపై మోదీ వారి నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకోనున్నారు.