BJP 40స్థానాలకు పైగా గెలుస్తుంది: అమిత్ షా
Delhi Assembly Election | దేశంలో ఎంతో మార్పు తీసుకొచ్చామని, ఇక ఢిల్లీ వంతు వచ్చిందంటూ బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీ కనీసం 40 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో చర్చించిన అమిత్ షా.. ఢిల్లీలో బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని భావిస్తుననారు. బీజేపీ శుక్రవారం నాడు పార్టీ మేనిఫెస్టో (సంకల్ప్ పత్రం)ను విడుదల చేసింది. గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని, అవినీతి రహిత పాలనను అందిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. పార్టీ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల స్థితిగతులపై అంతర్గత సర్వే చేసినట్లు సమాచారం.
ఆ సర్వే ప్రకారం బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 40 స్థానాల్లో విజయం సాధించనుంది. ఈ ఎన్నికల్లో BJP 47సీట్లకు పైగా సొంతం చేసుకుంటుందని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఇదివరకే వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీలో అధికారం చేపట్టేది తామేనని కమలనాథులు ధీమాగా ఉన్నారు. దేశం మారింది, ఇప్పుడు ఢిల్లీ వంతు వచ్చిందంటూ బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది. 2022లోగా ఢిల్లీలో అందరికీ ఇల్లు అనే హామీతో బీజేపీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: మేనిఫెస్టో విడుదల చేసిన ఢిల్లీ బీజేపీ
2024కల్లా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని బీజేపీ చెబుతోంది. ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకాలను ఢిల్లీ నగరంలో అమలు చేస్తామని హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి రూ.2కే కిలో గోధుమ పిండి అందజేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనుండగా, 11న ఫలితాలు వెలువడతాయి.