మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు
వాజ్‌పేయి కోలుకోవాలని కాంక్షిస్తూ బీజేపీ శ్రేణుల ప్రత్యేక పూజలు
మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్స్‌తో బాధపడుతూ ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ దేశవ్యాప్తంగా ఆలయాల్లో బీజేపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి. పలు చోట్ల కార్యకర్తలు యజ్ఞ, యాగాలు చేపట్టారు. వాజ్‌పేయి ఆరోగ్యం కుదుటపడాలని కోరుతూ కాన్పూర్‌లో బీజేపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మృధు స్వభావిగా పేరున్న నాయకుడు కావడంతో బీజేపీ శ్రేణుల్లోనే కాకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా వాజ్‌పేయిని అభిమానించే వాళ్లు భారీ సంఖ్యలో ఉన్నారు. దీంతో వాజ్ పేయి ఆరోగ్యంగా కోలుకోవాలని ఆకాక్షించే వారి సంఖ్య సైతం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.
సోమవారం మధ్యాహ్నం యధావిధిగా జరిగే వైద్య పరీక్షల్లో భాగంగా అటల్ బిహారి వాజ్‌పేయిని ఆస్పత్రికి తరలించినట్టు ఎయిమ్స్ ప్రకటించింది. అయితే, ఆస్పత్రిలో ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణ్‌దీప్ గులేరియా పర్యవేక్షణలో జరిపిన వైద్య పరీక్షల్లో వాజ్‌పేయి మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్స్‌తో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో ఇన్‌ఫెక్షన్స్ పూర్తిగా నయమయ్యే వరకు ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతారని పేర్కొంటూ ఎయిమ్స్ మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం వంటి వారు సైతం వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ట్వీట్ చేశారు.