BR Ambedkar Birth Anniversary 2022: డాక్టర్‌ భీంరావ్ రాంజీ అంబేడ్కర్.. భారత రాజ్యాంగ నిర్మాత. సామాజికంగా దేశ పురోగతికి మార్గదర్శనం చేసిన మహనీయుడు. ఇప్పటికీ ఆయన రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి. ఆయన సూచించిన మార్గాలే పాలకులకు మార్గదర్శకాలు. ఆయన ఆలోచనల నుంచి జాలువారిన నిర్ణయాలు, ప్రతిపాదనలు సమాజ ప్రగతికి సోపానాలుగా నిలిచాయి. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన గొప్పదనాన్ని నెమరేసుకుందాం. ఆయన ఆశయాలను విశ్లేషించుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సామాజిక అసమానతలు, అంటరానితనం అత్యంత భయంకరంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న కాలంలో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జన్మించారు. ఆ కాలంలో సామాజిక దురాచారాలను, దుర్మార్గాలను స్వయంగా అనుభవించారు. చదువుకునేందుకు అర్హుడు కాని కుటుంబంలో జన్మించాడన్న అవహేళనలు భరించారు. మెహర్ కులానికి చెందిన అంబేడ్కర్‌ను అప్పట్లో తరగతి గది బయటే కూర్చోబెట్టేవారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఆయన అప్పటి నుంచే హేళనలు, అవమానాలపై తిరగబడ్డారు. ఈ తరహా వివక్షలన్నింటినీ ఎదుర్కొంటూ మెట్రిక్యులేషన్‌ అత్యధిక మార్కులతో పాసయ్యారు. ప్రతీ విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేశారు. తన అనుభవాలనే నిచ్చెనలుగా వేసుకొని, తన ఆలోచనలనే అవకాశాలుగా మలచుకొని ఉన్నత స్థితికి ఎదిగారు. ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నారు. 'ప్రజాస్వామ్యంలో సమానత్వం' అనే కలను నెరవేర్చారు.


సాధారణంగా అంబేడ్కర్‌ అంటే కేవలం దళితులకే దేవుడని, అణగారిన వర్గాలకు మాత్రమే నాయకుడని సమాజంలో ఓ ముద్ర వేశారు. కానీ, అన్ని వర్గాలకూ అంబేడ్కర్‌ నాయకుడు. నైపుణ్యం, తెలివి, చురుకుదనం, కష్టపడే తత్వం ఉన్న అన్ని వర్గాల్లోని, అన్ని కులాల్లోని, అన్ని మతాల్లోని వారు వృద్ధి చెందేందుకు అవసరమైన బాటలు వేశారు డాక్టర్‌ అంబేడ్కర్‌. చిన్నప్పుడు తనను చిన్నచూపు చూసిన వాళ్లపట్ల ఆయన ద్వేషం పెంచుకోలేదు. తనపట్ల విద్వేషం చూపించిన వాళ్లకు వ్యతిరేకంగా వ్యవహరించలేదు. తన సామాజిక వర్గాన్ని హేళన చేసిన వాళ్ల గురించి ప్రతికూలంగా అస్సలు ఆలోచించలేదు. అందుకే అంబేడ్కర్‌ను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఆయన రాసిన రచనలు చదవాలి. ఆయన జీవితాన్ని అవగతం చేసుకోవాలి. ఆయన స్వయంగా రాసిన రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే అంబేడ్కర్‌ అసలు ఆలోచన ఏంటో, ఆయన స్వప్నం ఏంటో అర్థమవుతుంది. 


డాక్టర్‌ అంబేడ్కర్‌ భారత దేశపు మూలస్తంభపు పునాది ఏంటో తన అధ్యయనం ద్వారా కనిపెట్టారు. ఆ అధ్యయనంలో తన జీవితాన్ని కూడా అంకితం చేశారు. అంబేడ్కర్‌.. తన ఆశయం కోసం, భారతదేశ భవిష్యత్తు కోసం ఎంతగానో శ్రమించారు. బాంబే యూనివర్సిటీలో బీఏ చదివిన అంబేడ్కర్‌.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. కొలంబియా యూనివర్సిటీలో ఎంఎ పూర్తిచేశారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో ఎమ్మెస్సీ కంప్లీట్‌ చేశారు. ఆ తర్వాత మళ్లీ కొలంబియా విశ్వవిద్యాలయంలోనే పీహెచ్‌డీ పూర్తిచేశారు. అయినా, అంబేడ్కర్‌ చదువును అంతటితో ఆపలేదు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో డీఎస్సీ చదివారు. అంబేడ్కర్‌ విజ్ఞానాన్ని గుర్తించిన కొలంబియా యూనివర్సిటీ ఎల్‌ఎల్‌డి గౌరవ పట్టా ప్రదానం చేసింది. అలాగే, ఉస్మానియా యూనివర్సిటీ కూడా డాక్టర్ ఆఫ్ లిటరేచర్ గౌరవ పట్టా అందజేసింది. గ్రేస్‌ ఇన్‌ లండన్‌ యూనివర్సిటీలో బారిష్టర్‌ ఎట్‌ లా చదివారు భీంరావ్. విదేశాల్లో ఎకనమిక్స్‌లో డాక్టరేట్‌ పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. 


బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అన్ని రంగాలకు వర్తించే ఒక తాత్విక శక్తిగా ప్రజాస్వామ్యాన్ని మలచుకున్నారు. విద్యాభ్యాసం తర్వాత ఆర్ధికవేత్తగా, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకునిగా, న్యాయవాదిగా విభిన్న పాత్రలు పోషించారు. ఆ తర్వాత జాతీయోద్యమంలోకి ఎంటరయ్యారు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత సమానత్వం, సమన్యాయం లక్ష్యాల కోసం పరితపించారు. రాజ్యాంగ రచనా కమిటీకి నేతృత్వం వహించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగంగా (Constituion Of India) పేరొందిన భారత రాజ్యాంగం తయారీలో ఆయన కీలక పాత్ర పోషించారు. రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా నెలకొల్పడంలోనూ డాక్టర్‌ అంబేడ్కర్ పాత్ర ఉంది. చివరి రోజుల్లో అంబేడ్కర్‌ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. బుద్దుని బోధనలకు ఆకర్షితులై బౌద్ధుడయ్యారు. కుల, మత, జాతి రహిత ఆధునిక భారతావనికి కోసం అంబేద్కర్‌ ఎనలేని కృషి చేశారు. దేశపౌరులందరూ ఆయన జీవిత చరిత్రను చదవాల్సిన అవసరం ఉంది. ఆయన రచనలను అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఫలితంగా భారతదేశ ప్రగతిలో మనవంతు కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు మార్గం లభిస్తుంది.


Also read : India Corona Update: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా..??


Also read : Bank Holidays April 2022: కస్టమర్లకు అలర్ట్... ఈ వారంలో వరుసగా 4 రోజులు బ్యాంకు సెలవులు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook