బెంగళూరు: సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌, జేడీఎస్‌ మధ్య పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చింది. దళితుడైన పీసీసీ అధ్యక్షుడు జీ పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి కానున్నారు. బుధవారం సీఎంగా కుమారస్వామితో పాటు డిప్యూటీ సీఎంగా జీ పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంత్రి పదవుల పంపకంపై మంగళవారం కాంగ్రెస్, జేడీఎస్ నేతలు సుదీర్ఘ చర్చలు జరిపారు. మొత్తం 34 శాఖల్లో కాంగ్రెస్‌కు చెందిన 22 మందికి మంత్రి పదవులివ్వాలని నిర్ణయించారు. జేడీఎస్ నుంచి 12 మందికి మంత్రి పదవులు దక్కనున్నాయి. అటు స్పీకర్‌ పదవి కూడా కాంగ్రెస్‌కే దక్కింది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. డిప్యూటీ స్పీకర్‌ పదవి జేడీఎస్‌కు ఇచ్చారు. పదవుల సంఖ్య ఖరారైందే కానీ ఎవరిని తీసుకోవాలో బలపరీక్ష తర్వాతే నిర్ణయిస్తామని ఏఐసీసీ ప్రతినిధి కేసీ వేణుగోపాల్‌ చెప్పారు.


సీఎం పదవి అంత సులువైంది కాదు: కుమారస్వామి


ముఖ్యమంత్రి పదవి అంత సులువైనది కాదని, ముళ్ల కిరీటం లాంటిదనే విషయం తెలుసని కుమారస్వామి వ్యాఖ్యానించారు. మంగళవారం ధర్మస్థల మంజునాథ స్వామి, శృంగేరి శారదాదేవిలను ఆయన దర్శించుకున్నారు. కన్నడ చిత్రపరిశ్రమలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న హెచ్‌.డి.కుమారస్వామి 2006 ఫిబ్రవరి 3 నుంచి 2007 అక్టోబరు 9 వరకు రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు.