Arvind Kejriwal: 10 హామీలతో కార్డు విడుదల చేసిన అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీలో మహిళలకు ఇదివరకే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోన్న కేజ్రీవాల్ సర్కార్.. తమను మరోసారి ఎన్నుకుంటే విద్యార్థులకు కూడా ఆ సౌకర్యాన్ని అందిస్తామని కార్డులో తెలిపారు.
న్యూఢిల్లీ : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొన్ని హామీ అంశాలను విడుదల చేశారు. ఢిల్లీలో మహిళలకు ఇదివరకే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోన్న కేజ్రీవాల్ సర్కార్.. తమను మరోసారి ఎన్నుకుంటే విద్యార్థులకు కూడా ఆ సౌకర్యాన్ని అందిస్తామని కార్డులో తెలిపారు. ఆదివారం (జనవరి 19న) 10 హామీలతో కూడిన గ్యారంటీ కార్డును కేజ్రీవాల్ విడుదల చేశారు. నీరు, విద్యుత్ వంటి నిత్యావసరరాలపై సబ్సిడీ అందించనున్నామని చెప్పారు.
Also Read: 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడాన్ని సైతం హామీలలో పేర్కొనడం గమనార్హం. నిరంతర విద్యుత్ అందించడంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచితమని తొలి హామీగా ప్రకటించారు. ఢిల్లీలో ఎక్కడ చూసిన వైర్లు కనిపిస్తున్నాయని, అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 24 గంటలపాటు తాగునీరు అందిస్తామని, 20వేల లీటర్ల ఉచిత నీటి సౌకర్యం కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ పరిధిలోని ప్రతి చిన్నారికి వరల్డ్ క్లాస్ చదువును అందించడమే మూడో హామీ. ఆరోగ్య హామీ నాలుగో హామీ. అతిచౌక, అత్యంత ఎక్కువ రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఐదవ హామీ ఇచ్చారు. యమునా నదిని ప్రక్షాళన చేయడంతో పాటు ఢిల్లీలో కాలుష్యాన్ని నిర్మూలించనున్నామని 6వ హామీలో తెలిపారు.
రానున్న అయిదేళ్లలో ఢిల్లీని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దుతామని ఏడో హామీ ఇచ్చారు. మోహళ్ల మార్షల్స్ విధానాన్ని తీసుకొచ్చి మహిళల భద్రత పెంచడం 8వ హామీ. వెనుకబడిన, మురికివాడలాంటి ఏరియాలలకు నీటి సరఫరా, సీసీటీవీ, మోహళ్ల క్లినిక్స్ ఏర్పాటు చేయనున్నట్లు మరో హామీ ఇచ్చారు. ‘జహన్ ఝగ్గి వహిన్ మకన్’ పథకం కింద పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని 10వ హామీలో పేర్కొన్నారు.
అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘నేను 10 హామీలు ఇచ్చాను. ఇది పార్టీ మేనిఫెస్టో కాదు. అంతకంటే ఎక్కువ. ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ 10 సమస్యలను పరిష్కరించడానికి ఆప్ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. హామీల్లో ప్రకటించిన ఉచిత పథకాలు వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తాం. ఆప్ మేనిఫెస్టోను వారం లేక 10 రోజుల్లో విడుదల చేయనున్నామని’ వెల్లడించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు నిర్వహించి, 11న ఫలితాలు ప్రకటించనున్నట్లు ఈసీ ఇదివరకే ప్రకటన చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..