ఢిల్లీలో నగర వాసులకు ఉచితంగా నిరంతర వైఫై(Free WiFi in Delhi) సౌకర్యం అందిస్తామని 2015 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. అప్పుడు ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఢిల్లీలో మొత్తం 11,000 చోట్ల హాట్ స్పాట్స్(11000 Hotspots) ఏర్పాటు చేసేందుకు ఢిల్లీ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో 4000 హాట్‌స్పాట్స్ బస్‌స్టాపుల్లో ఏర్పాటు చేయనుండగా... మరో 7000 హాట్‌స్పాట్స్ లోకల్ మార్కెట్స్‌లో ఏర్పాటు చేయనుంది. తొలుత డిసెంబర్ 16న 100 హాట్‌స్పాట్స్‌ని ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అందుకోసం రూ.100 కోట్లు ఖర్చు కానున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పథకం ప్రారంభించిన అనంతరం తొలి దశలో ప్రతీ యూజర్‌కి నెలకు 15GB వరకు ఉచితంగా డేటా అందించనున్నట్టు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు.  


ఇంకొద్ది రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.