న్యూఢిల్లీ: ఎన్నికల రణరంగంలో ఏదైనా సాధ్యమే అని ఇవాళ కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో నిత్యం ఊహించని పరిణామాలు ఏవో ఒకటి చోటుచేసుకుంటూనే వుంటాయి. అలాంటి పరిణామమే ఒకటి తాజాగా లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై బీజేపీ తరపున బోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ దినేష్ లాల్ యాదవ్ అక నిరహ్వా బరిలో నిలిచారు. నేడు బీజేపి ప్రకటించిన 16వ జాబితాలో ఆరుగురికి చోటుదక్కగా అందులో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆజంఘడ్ స్థానం నుంచి దినేష్ లాల్ యాదవ్ పేరు కూడా ఉంది. 


మార్చి 27నే దినేష్ లాల్ యాదవ్ బీజేపిలో చేరారు. 2005లో బోజ్‌పురి సినీ పరిశ్రమకు పరిచయమైన దినేష్ లాల్ యాదవ్.. ఆ తర్వాత 20కిపైగా సినిమాల్లో నటించి అనతికాలంలోనే అక్కడి స్టార్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆ సందర్భంలోనే దినేష్ లాల్ యాదవ్‌ని ఇంటర్వ్యూ చేసిన జీ న్యూస్... ఆయనను బీజేపి అధిష్టానం అఖిలేష్ యాదవ్‌పై పోటీకి దింపితే బరిలో నిలవడానికి సిద్ధమేనా అని ప్రశ్నించగా.. ''పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీచేయడానికైనా తాను సిద్ధమే'' అని అన్నారు. ''అఖిలేష్ యాదవ్ ఒక పెద్ద నాయకుడు'' అని చెబుతూనే ఆయనపై పోటీకి దిగాలంటే చిన్నాచితక నేతలు సరిపోరని, అది పెద్ద వాళ్ల వల్లే సాధ్యపడుతుందని తెలిపారు.