న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన నాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీజే జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అక్టోబర్‌ 2న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర న్యాయశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో కొత్త సీజే నియామకం గురించి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అభిప్రాయాన్ని కోరగా.. నూతన సీజేగా సీనియర్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పేరును ప్రతిపాదిస్తూ న్యాయశాఖకు లేఖ రాశారు. అన్నీ సవ్యంగా జరిగితే.. అక్టోబరు 3న రంజన్‌ గొగోయ్‌ 46వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గొగోయ్‌ వచ్చే ఏడాది నవంబర్ 17 పదవీవిరమణ చేస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేపథ్యం..


జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ 1954లో అసోంలో జన్మించారు. 1978లో బార్‌ అసోసియేషన్‌లో పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయన.. గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 2001లో గొగోయ్‌ గౌహతి హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై.. 2011లో పంజాబ్‌-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012లో జస్టిస్‌ గొగోయ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.