ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ని ఎయిమ్స్ ఆసుపత్రి డిశ్చార్జి చేసింది. ప్రసుత్తం ఆయన పరిస్థితి బాగానే ఉందని.. ఆయన ఆరోగ్య సమస్యలకు తగ్గ ట్రీట్‌మెంట్ ఇవ్వడం జరిగిందని.. ఇతరత్రా మామూలు రుగ్మతలకు ఆయన తమకు రిఫరెన్స్ ఇచ్చిన రిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చని తెలిపింది. అయితే ఎయిమ్స్ వైఖరిని లాలూ తప్పు పట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ అంశాన్ని ఒక రాజకీయ కుట్ర క్రింద ఆయన అభివర్ణించారు. ఆసుపత్రి నుండి బయటకు రాగానే ఆయన ఎయిమ్స్ కార్యవర్గం పై మండిపడ్డారు. తనకు ఒంట్లో బాగాలేకపోయినా.. కావాలనే డిశ్చార్జి చేస్తున్నారని.. తనకు ఏమైనా అయితే ఆసుపత్రి వర్గాలే బాధ్యత తీసుకోవాలని ఆరోపించారు. ఎప్పుడైతే లాలూ చేస్తున్న ఆరోపణలు విన్నారో.. ఆయన అనుచరులు ఆసుపత్రిలోకి వెళ్లి సిబ్బందిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అలజడి రేపేందుకు ప్రయత్నించారు. అయితే ఆసుపత్రి సెక్యూరిటీ విభాగం వేగంగా స్పందించడంతో వారిని సకాలంలో నిలువరించడం జరిగింది.



అంతకు క్రితమే లాలూ ఆసుపత్రి వర్గాలకు లేఖ రాశారు. తన ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యేవరకూ ఆసుపత్రిలోనే ఉండనివ్వాలని.. రిమ్స్‌కు తిరిగి పంపించవద్దని కోరారు. అయితే ఎయిమ్స్ ఆయనను డిశ్చార్జి చేసింది. ఈ క్రమంలో ఆర్జేడీ ఎంపీ జయప్రకాష్ నారాయణ్ యాదవ్ ఎయిమ్స్ యాజమాన్యాన్ని దూషించారు. ఆ సంస్థ సీబీఐ ఒత్తిడికి అనుగుణంగా పనిచేస్తోందని ఆరోపించారు.



లాలూ ప్రాణానికి గండం ఉందని.. ఒంట్లో బాగాలేకపోయినా ఆయనను ఎందుకు డిశ్చార్జి చేస్తున్నారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. లాలూ ఆసుపత్రి నుండి బయటకు రాగానే తనను జీపు వద్దకు తీసుకెళ్తున్న పోలీసుల మీద మండిపడ్డారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కేసుల్లో భాగంగా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. లాలూ అనుచరులు ఎప్పుడైతే ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారో.. వెంటనే ఎయిమ్స్ డిప్యూటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ స్థానిక పోలీస్ స్టేషనులో రాతపూర్వక ఫిర్యాదును అందించారు.