బెంగళూరు: మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక కాంగ్రెస్ నేత డికె శివ కుమార్ ఆయన కుమార్తె ఐశ్వర్యకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసింది. సెప్టెంబర్ 12న ఐశ్వర్యను తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఈడి ఈ నోటీసుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 3న శివ కుమార్ కాగా అతడిని 10 రోజులపాటు ఈడి కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని కోర్టు ఆదేశాలు జారీచేసింది. గతేడాది సెప్టెంబర్‌లో ఇన్‌కమ్ టాక్స్ అధికారులు నమోదు చేసిన కేసులో ఈడి అధికారులు శివ కుమార్‌ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐశ్వర్య నుంచి పలు వివరాలు రాబట్టేందుకే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెకు నోటీసులు జారీచేసినట్టు తెలుస్తోంది.


గతేడాది కాలంగా ఈ కేసులో విచారణ జరిపిన ఆదాయ పన్ను శాఖ అధికారులు.. శివకుమార్ జరిపిన లావాదేవీల్లో పలు అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. అంతేకాకుండా ఢిల్లీ, బెంగళూరుకు చెందిన కొంతమంది వ్యక్తుల ద్వారా శివకుమార్ మనీలాండరింగ్, హవాలా ఆపరేషన్స్ జరిగినట్టు ఐటి అధికారుల విచారణలో బయటపడినట్టు సమాచారం.