మీ ఈపిఎఫ్ ఖాతాల్లోకి త్వరలోనే వడ్డీ జమ
త్వరలోనే 6 కోట్లకుపైగా ఈపిఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో రూ. 54,000 కోట్లు వడ్డీ జమ
న్యూఢిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) వడ్డీరేటును 8.55 నుంచి 8.65 శాతానికి పెంచుతున్నట్టుగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ మంగళవారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి జారీ అయిన ఉత్తర్వుల మేరకు పెరిగిన వడ్డీ మొత్తం రూ.54వేల కోట్లు త్వరలోనే 6 కోట్ల మందికిపైగా ఈపిఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో జమ కానుందని కేంద్ర మంత్రి తెలిపారు. .
ఈపిఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. ఈపిఎఫ్ ఖాతా కలిగిన ఉద్యోగి ఫైనల్ సెటిల్‌మెంట్ క్లెయిమ్ చేసుకోవడానికి 20 రోజులు, ఒకవేళ ఉద్యోగి రాజీనామా చేసినట్టయితే, ఈపిఎఫ్ క్లెయిమ్ చేసుకోవడానికి 2 నెలలు సమయం పడుతుంది. ఒకవేళ వ్యక్తిగత అత్యవసరాల కోసం కొంత మొత్తాన్నే ఖాతా నుంచి విత్‌డ్రా చేసుకోవాలని ఉద్యోగి భావించినట్టయితే.. ఉద్యోగి క్లెయిమ్ దరఖాస్తును ఈపిఎఫ్ వారు సదరు ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీకి, లేదా కార్యాలయానికి పంపించి.. అక్కడి నుంచి అనుమతి పొందిన అనంతరం 10 రోజుల్లో ఉద్యోగి ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేస్తారు.