మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఆస్పత్రిలో చేరారు. తరచుగా చేసే వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తమే వాజ్‌పేయిని ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. డా. రణ్‌దీప్ గులేరియా సూచనల మేరకే వాజ్ పేయిని ఆస్పత్రిలో చేర్పించినట్టు సమాచారం. భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన అనంతరం ఆ పార్టీ తరపున దేశ ప్రధాని అయిన మొట్టమొదటి వ్యక్తి అటల్ బిహారి వాజ్‌పేయి. 1996 నాటి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 140 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా బీజేపీ 161 స్థానాలు గెల్చుకుని దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిగా రేసులో నిలిచిన ఏబీ వాజ్‌పేయి దేశానికి 10వ ప్రధానిగా ఎన్నికయ్యారు.  


ఇదిలావుంటే, 2004లో కేంద్రంలో పార్టీ అధికారం కోల్పోయిన అనంతరం క్రమక్రమంగా రాజకీయాలకు దూరమవుతూ వచ్చిన వాజ్ పేయి 2005లో రాజకీయాల నుంచి శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి పలు అనారోగ్య కారణాలరీత్యా వాజ్‌పేయి ఇంటికే పరిమితమయ్యారు.