IAS Harjot Kaur's Free Condoms Controversy: ఆమె ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మాత్రమే కాదు.. రాష్ట్ర మహిళా అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కి మేనేజింగ్ డైరెక్టర్ కూడా. పదవులు, పోస్టుల సంగతి పక్కనబెడితే.. అన్నింటికి మించి సాటి మహిళలు, ఒక వయసొచ్చిన అమ్మాయిలు అనుభవించే సగటు ఇబ్బందులు గురించి అర్థం చేసుకోవాల్సిన ఒక స్త్రీ.. ఒక మాతృమూర్తి. అయినప్పటికీ విద్యార్థినులపట్ల ఒకింత దురుసుగా ప్రవర్తించారు. అది కూడా సమాజంలో ఎంతో మంది మహిళలు ఎదుర్కొంటున్న ఒక సున్నితమైన అంశం పట్ల. ఇంతకీ ఆమె ఎవరు.. ఆమె చేసిన నోటి దురుసు వ్యాఖ్యలేంటి అని తెలుసుకోవాలంటే ఇదిగో ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ సినియర్ ఐఏఎస్ ఆఫీసర్ పేరు హర్‌జ్యోత్ కౌర్ భమ్రా.. బీహార్ మహిళా అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మహిళల అభివృద్ధి కోసం పాటుపడే ఒక కీలకమైన పదవిలో కొనసాగుతున్నారు. మహిళా సాధికారిత కోసం చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా తాజాగా జరిగిన స్వశక్త్ భేటీ, సమృద్ధి బీహార్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ జరుగుతోంది. స్టేజీపై కూర్చున్న ప్రతినిధులలోంచి ఒక విద్యార్థిని లేచి ఒక సున్నితమైన ప్రశ్న అడిగారు. ప్రభుత్వాలు ఏవేవో ఉచితంగా ఇస్తున్నారు కదా.. అలాగే మహిళలకు రూ. 30 విలువ చేసే శానిటరీ ప్యాడ్స్ ఫ్రీగా ఇవ్వలేదా అని ఐఏఎస్ ఆఫీసర్‌కి ఓ ప్రశ్న సంధించారు. అదే ఆ విద్యార్థిని చేసిన తప్పు కాబోలు అన్నట్టుగా ఐఏఎస్ ఆఫీసర్ హర్‌జ్యోత్ కౌర్ ఆమెపై మాటలతోనే విరుచుకుపడినంత పని చేశారు. ఇవాళ శానిటరి ఫ్యాడ్స్ ఫ్రీగా కావాలంటారు.. రేపు కుటుంబనియంత్రణ కోసం కండోమ్స్ ఫ్రీగా కావాలంటారు అంటూ ఎడాపెడా చీవాట్లు పెట్టినంత పని చేసిందామె. 


ఐఏఎస్ ఆఫీసర్ హర్‌జ్యోత్ కౌర్ స్పందించిన తీరుకు బిత్తరపోయిన విద్యార్థిని, ఆమె తోటి వారు తిరిగి మరోసారి ఎదురు ప్రశ్నించడంతో ఈసారి కొంత సర్ధుకుంటూ.. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో ఇస్తోందని.. అయినా ఇంకా ఏదో కావాలంటే ఎలా అంటూ సర్ధిచెప్పుకొచ్చారామె. మొత్తానికి ఒక విద్యార్థినిపట్ల, సాటి మహిళా లోకం పట్ల హర్‌జ్యోత్ కౌర్ స్పందించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. 



ఇప్పటికే శానిటరీ ప్యాడ్స్ కోసం డబ్బులు వెచ్చించేంత ఆర్థిక స్తోమత లేని నిరుపేద మహిళలు, విద్యార్థినులు ఏవేవో ఇతర పద్ధతులను అనుసరించి అనారోగ్యం బారినపడుతున్నారు. బాగా వెనుకబడిన ప్రాంతాల్లో, మారుమూల పల్లెల్లో శానిటరీ ప్యాడ్స్ వినియోగంపై అవగాహన లేక పాతకాలం పద్ధతలనే ఆశ్రయించి కొంత ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ని అందుబాటులోకి తీసుకురావలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. కొంతమంది సామాజిక కార్యకర్తలు, ఎన్జీఓలు ఈ అంశంపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమం స్థాయిలో పనిచేస్తోంటే.. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి ఇలాగేనా మాట్లాడేది అని మహిళా లోకం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. 


ఒకవేళ ప్రభుత్వం నుండి అన్ని ఉచితంగా ఆశించడం మానేసి స్వశక్తితో ఎదిగేందుకు కృషి చేయాలని చెప్పడం సదరు ఐఏఎస్ ఆఫీసర్ ఉద్దేశం అనుకున్నప్పటికీ.. అది చెప్పే తీరు ఇది కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఒక విద్యార్థిని చెప్పే సూచనలను, సాటి మహిళా లోకం సమస్యలను అర్థం చేసుకోలేని ఐఏఎస్ ఆఫీసర్ హర్‌జ్యోత్ కౌర్.. రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టుకు మాత్రం ఏం న్యాయం చేస్తారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏదేమైనా.. మొత్తానికి తనకు తెలియకుండానే ఒక సున్నితమైన అంశంపై ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసి ఆమె ఒక తేనేతొట్టేనె కదిపారని చెప్పొచ్చు. మున్ముందు ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.. ఈ వివాదంపై హర్‌జ్యోత్ కౌర్ ఇంకెలాంటి వివరణ ఇచ్చుకుంటారో వేచిచూడాల్సిందే మరి.