గోవా ఎమ్మెల్యే గ్లెన్ టిల్కో కుమారుడు చేసిన ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఓ అమాయకురాలైన యువతి ప్రాణాలు కోల్పోయింది. కర్ణాటకలోని బెల్గావి ప్రాంతానికి ఓ పని మీద వచ్చిన ఎమ్మెల్యే టిల్కో కుమారుడు వాహనాన్ని వేగంగా నడుపుతూ వెళ్లి రోడ్డు దాటుతున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొన్నాడు. ఈ ఘటనలో 18 సంవత్సరాల యువతి మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కుమారుడిని అరెస్టు చేసిన పోలీసులు... ఆ తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. గోవా - బెల్గాం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన జరగగానే కోపోద్రిక్తులైన స్థానికులు, ఎమ్మెల్యే కుమారుడి వాహనంపై దాడి చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తర్వాత పోలీసులు నిందితులను అరెస్టు చేశాక.. కొందరు స్థానికులు వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. గోవా ఎమ్మెల్యే కుమారుడైన 27 సంవత్సరాల కెయిల్ గ్లెన్ సౌజా టిల్కో లగ్జరీ కారును స్పీడుగా నడుపుతూ.. రహదారి మార్గానికి దగ్గరగా ఉన్న పండ్ల మార్కెట్ వద్ద యాక్సిడెంట్ చేశాడు. ముగ్గురు అమ్మాయిలు రహదారిని దాటుతున్నప్పుడు... కారు స్పీడును కంట్రోల్ చేయలేకపోవడంతో ఎమ్మెల్యే కుమారుడు వారిని ఢీకొన్నాడు. 


ఎమ్మెల్యే కొడుకు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఈ సందర్భంగా బెల్గావి డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ సీమా లత్కర్ తెలిపారు. ఆయనపై కేసు కూడా నమోదు చేశామని ఆమె అన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీస్ కమీషనర్ డీసీ రాజప్ప విచారణకు ఆదేశించారు. సోమవారం సాయంత్రం జాతీయ రహదారి 4 వద్ద ఆ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన మూలంగా బెల్గావి సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే కుమారుడి చర్యను ఖండిస్తూ.. రహదారిపై ఆందోళనలు కూడా చేశారు.